దేవీపట్నం: నాలుగు రోజుల కిందట ఈనుకొండకు చేరిన పెద్దపులి గురువారం రాత్రి కొత్త వీధిలో నాలుగు పశువులపై దాడిచేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పులిని బంధించేందుకు అటవీ అఽధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శనివారం పోతవరం సమీపంలోని జోడుమామిళ్లు సమీపంలో పులి సంచరించింది. సాయంత్రం సమయంలో గోకవరం, దండంగి ఆర్‌అండ్‌బీ రహదారిని దాటుకుని డి.రావిలంక, పరగసానిపాడు, పూడిపల్లి గ్రామాల్లో తిరిగింది. కొత్తవీధిలో నాలుగు పశువులను చంపిన తర్వాత ఇప్పటివరకూ ఏ జంతువుకు హాని కలిగించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి ఆహారం కోసం పులి వేటాడేందుకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుందనే ఆలోచనతో అటవీ అధికారులు పూడిపల్లి పరిసర ప్రాంతాలలో ట్రాప్‌ను సిద్ధం చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో అధిక సంఖ్యలో గేదెలు ఉన్నాయి. ఆదివారం రాత్రికి పూడిపల్లి వద్ద సీతపల్లి వాగును దాటి దేవీపట్నం వైపునకు మరలుతుందా, లేక గోదావరి దాటి పశ్చిమగోదావరి వైపు వెళుతుందా అని అటవీ అఽధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ దేవీపట్నం వైపు మరలితే పులిని విడిచిపెట్టిన కొండమొదలు ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ గోదావరిని దాటి పశ్చిమగోదావరి వైపు మరలితే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను దాటుకుని పులి పయనాన్ని ప్రారంభించిన ప్రాంతమైన మహారాష్ట్రలోని తడోబా అభయ అరణ్యానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
నూకాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
సామర్లకోట: పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి జాతర ఉత్సవాలు కొత్త అమావాస్య సందర్భంగా ప్రారంభించారు. మే 3 వరకు ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆది, గురువారాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇందులో భాగంగా రెండో ఆదివారం కావడంతో తెల్లవారు జామునే ఆలయానికి అనేక మంది వచ్చారు. ఆలయ సమీపంలో ఉన్న తోటలో వాహనాలను పార్కింగ్ చేసి అమ్మవారిని దర్శించుకుని ఆ తోటలోనే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద తిరునాళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ రాంబాబురెడ్డి, చైర్మన్ లొల్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. ఎస్సై మౌనిక ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
‘ఈనాడు’ అనుచిత కార్టూన్‌పై చర్యలకు ఫిర్యాదు
కపిలేశ్వరపురం (మండపేట): ఈనాడు దినపత్రికలో ఈ నెల 28న ఇదీ సంగతి శీర్షికన ప్రచురితమైన కార్టూన్ అనుచితంగా ఉందని, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరువు, ప్రతిష్టలను దెబ్బతీసేదిగా ఉందంటూ మండపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కార్టూన్ గీసిన వారిపై, ప్రచురణకర్తపై, ఎడిటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్ సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ తన ఫిర్యాదులో కోరారు. పోలీసులను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు మందపల్లి రవికుమార్, పొలమాల సత్తిబాబు, జొన్నపల్లి సత్తిబాబు, జెల్లా కాదర్‌నాథ్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు
ఏలేశ్వరం: మంచివాళ్లు చేసే తప్పులే మహా విపత్తులకు కారణమవుతాయని, అందరూ మంచివారే కానీ నాటిక కళ్లకు కట్టినట్టు చూపించింది. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లిబుజ్జి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం యడ్లపాడు మానవతా వారి అందరూ మంచివారే కానీ నాటికకు రచన, దర్శకత్వం జరుగుల రామారావు అందించారు. రెండో నాటికగా మాతృత్వం ఆకట్టుకుంది. గుంటూరు శ్రీరమణ కళానిలయం వారి మాతృత్వం నాటికకు మూలకథ సుఖమంచి కోటేశ్వరరావు అందించగా, పాగర్తి నాగేశ్వరరావు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.


