● తిరిగి వెళ్తుండగా ప్రమాదం
● కూలీలతో వ్యాన్ అర్ధరాత్రి బోల్తా
● ఉదయం వెలుగులోకి..
● మహిళ మృతి, 11 మందికి గాయాలు
చింతూరు: వారంతా నిరుపేదలే.. పొట్టకూటి కోసం బతుకు జీవుడా అంటూ వచ్చారు.. కొద్దిపాటి సొమ్ము సంపాదించుకుని సొంతూరుకు ఆనందంగా బయలుదేరారు.. చివరికి అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు.. భద్రాచలం, చట్టి జాతీయ రహదారి–326పై చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం నడుమ శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కట్టేకళ్యాణ్‌కు చెందిన కొంతమంది కూలీలు మిరప కాయలు కోసేందుకు రెండు నెలల క్రితం ఎటపాక మండలం మురుమూరు వచ్చారు. కూలి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి వారు బొలెరో వ్యాన్‌ను కిరాయికి రప్పించుకున్నారు. శనివారం రాత్రి 13 మంది కూలీలతో కట్టేకళ్యాణ్‌కు బయలుదేరిన వ్యాన్ అర్ధరాత్రి దాటాక చింతూరు మండలం బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి నడుమ ఉన్న ఓ కల్వర్టు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి బోల్తాపడింది. వాహనం అర్ధరాత్రి బోల్తా పడినా చీకటి కావడంతో వాహనాన్ని ఉదయం వరకూ ఎవరూ గమనించలేదు. ఆదివారం ఉదయం లోయలో ఉన్న వాహనాన్ని, క్షతగాత్రులను గుర్తించిన ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుని ఉన్న క్షతగాత్రులను బయటకు తీసి ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మడకం పైకే (35) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ వివరించారు.
కూలి పనులకు వచ్చి..
సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ పనులు ముగిశాక పొట్టకూటి కోసం పొరుగునే ఉన్న ఆంధ్రా, తెలంగాణకు ప్రతి ఏటా కూలికి రావడం వారికి పరిపాటి. ఇక్కడకు వచ్చిన వారు మిర్చి తోటలు, జామాయిల్ కటింగ్ పనులు చేస్తుంటారు. నెల, రెండు నెలల పాటు కూలి పనులు చేసిన అనంతరం సొమ్ములు తీసుకుని వారి రాష్ట్రానికి తిరిగి వెళుతుంటారు. ఈ క్రమంలోనే పనులు ముగించుకుని తిరిగి వెళుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఓ మహిళ మృతి చెందింది. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఉదయం వరకూ ఆ గాయాలతో వారు నరకయాతన అనుభవించారు.
పరిమితికి మించి ప్రయాణమే కారణమా?
బొలెరో వ్యాన్‌లో సాధారణంగా ఏడుగురు లేదంటే తొమ్మిది మంది ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఈ వ్యాన్‌లో పరిమితికి మించి డ్రైవర్‌తో సహా 13 మంది ప్రయాణిస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోజువారీ కూలీలను పరిమితికి మించి వాహనాల్లో ఎక్కిస్తూ వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ‘సాక్షి’ ముందుగానే హెచ్చరించింది. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ‘ఈ మ్యాజిక్కులు ఎన్నాళ్లో’ శీర్షికన కథనం కూడా ప్రచురితమైంది. అత్యాశతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తూ ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రెండు బైక్‌లు ఢీకొని..
చింతూరు మండలం పోతనపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. రంపచోడవరానికి చెందిన కానెం సాయితేజ, అతని భార్య గంగోత్రితో పాటు కూనవరానికి చెందిన పండు, దుర్గాప్రసాద్‌కు గాయాలయ్యాయి. వీరికి చింతూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేశారు.


