అవనికి అవసారం | - | Sakshi
Sakshi News home page

అవనికి అవసారం

Mar 30 2026 8:36 AM | Updated on Mar 30 2026 8:36 AM

పీఎండీఎస్‌ సాగుతో ప్రయోజనాలు

ఎకరాకు 20 టన్నుల పశుగ్రాసం

టన్నుకు రూ.3 వేల వరకూ ఆదాయం

పిఠాపురం: రబీ సాగు చివరి దశకు చేరుకుంది.. వేసవిలో రైతులు అపరాల సాగు చేయడం లేకుంటే, భూములను ఖాళీగా వదిలేయడం చేస్తుంటారు. భూములు ఖాళీగా ఉంటే భూసారం తగ్గడంతో పాటు క్రిమికీటకాలు భూమిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, తరువాత పంటలకు హాని కలిగిస్తాయి. వీటికి చెక్‌ పెట్టడానికి ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. భూమికి ఆరోగ్యం.. పోషక విలువల ఆహార పంటలు, ప్రజలకు ఆరోగ్యం తదితర బహుళ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ (పీఎండీఎస్‌) సాగుకు చేపట్టింది. అంటే జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్టతో పాటు పెసలు, మినుములు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, దుంప జాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇస్తోంది. వేసవిలో రైతులకు అదనపు ఆదాయంతో పాటు పశువులకు మేత అందించే నవ ధాన్యాల సాగుకు చేపట్టాలని అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయ శాఖ గత ఏడాది ఎకరానికి 10 కిలోల చొప్పున విత్తనాలను రైతులకు అందించింది. ఇలా రైతులు సాగు చేసిన 400 ఎకరాల్లో పీఎండీఎస్‌ విత్తనాలతో సారవంతంగా మొక్కలు రావడంతో రైతుకు అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కూడా నవ ధాన్యాల సాగుకు ప్రకృతి వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. గత ఏడాది కాకినాడ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పీఎండీఎస్‌ సాగు చేశారు. మొత్తం 56 వేల మంది రైతులు ఈ విత్తనాలను వేశారు. ఇందుకు గాను ప్రకృతి వ్యవసాయ శాఖ 400 టన్నుల విత్తనాలను రైతులకు పంపిణీ చేసింది. దీనిద్వారా సుమారు 60 వేల టన్నుల పశుగ్రాసం వచ్చింది. రైతులు సుమారు రూ. 6 కోట్ల ఆదాయం పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 86,959 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 60,349 మంది రైతులకు 450 టన్నుల పీఎండీస్‌ విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ధేశించారు.

భూమికి ఎంతో మేలు

పీఎండీఎస్‌ సాగు చేసిన పంట పొలాల్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ పొలాల్లో భూసారం పెరగడంతో పాటు రైతుకు మంచి అదనపు లాభాలను తెచ్చిపెట్టింది. భూమి గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కలుపు నివారణ జరుగుతుంది. పురుగులు, తెగుళ్ల నివారణ, రైతు మిత్రులు వానపాముల వృద్ధి జరిగి మిత్ర పురుగుల శాతం అధికమవుతుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గి ఖర్చు అదుపులో ఉంటుంది. భూమి కోతకు గురి కాకుండా కాపాడుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. భూతాపం తగ్గి విపత్తులను తట్టుకునే శక్తి వస్తుంది. నేలలో సేంద్రియ కర్బనం రెండు శాతం వరకూ పెరిగి సూక్ష్మజీవుల వైవిధ్యం పెరిగి అనేక పోషకాలు పైరుకు అందుతాయి.

బలవర్ధక పశుగ్రాసం

పీఎండీఎస్‌ పంట ఏపుగా పెరగడంతో ఎకరానికి సుమారు 20 టన్నుల వరకూ నాణ్యమైన పోషక విలువలున్న పశుగ్రాసం లభ్యమవుతోంది. దీంతో ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ రైతుకు అదనపు ఆదాయం సమకూరుతోంది. వివిధ మిల్క్‌ డెయిరీలకు చెందిన యజమానులు పీఎండీఎస్‌ పశుగ్రాసం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజూ 200 టన్నులకు పైగా పశుగ్రాసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకపక్క భూమి సారవంతం అవ్వడంతో పాటు మరోపక్క రైతుకు ఆదాయం వస్తుండడంతో పీఎండీఎస్‌ సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇలా చేస్తే కళకళలాడుతూ..

వేసవిలో ఈ విత్తనాలను ఖాళీగా ఉండే భూముల్లో వేయడం ద్వారా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. బీడు భూములు సారవంతం అవుతున్నాయి. పశువుకు గ్రాసం అందుతుంది. నేల రంగు మారి సారవంతం కావడం, వేరు వ్యవస్థ పటిష్టంగా పెరిగి, వాతావరణ ఆటుపోట్లను తట్టుకొని నిలబడడం జరుగుతుంది. జీవవైవిధ్యం పెరుగుతుంది. పంట ఉత్పత్తుల నాణ్యత, పోషక విలువలు పెరుగుతాయి. 365 రోజులు భూమి కప్పబడి ఉండి సకాల వర్షాలకు దోహదపడుతుంది. ఈ గ్రాసం తిన్న పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది. పాలలో వెన్న శాతం అధికమవుతోంది. ఇలా నవధాన్యాల సాగుతో రైతులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement