● పోలీసులను తప్పుదోవ పట్టించిన మహిళ
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సుభాష్
కోరుకొండ: బంగారు ఆభరణాలపై రూ.లక్షల బీమాను పొందవచ్చనే దురుద్దేశంతో చోరీ జరిగినట్టు నమ్మించిన ఓ మహిళ పన్నాగాన్ని ఛేదించినట్లు క్రైం డీఎస్పీ సుభాష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కోరుకోండ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన కథనం ప్రకారం.. కోరుకొండ మండలం కాపవరం శివారులోని నార్త్ జోన్ డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో ముండ్రు పద్మ నివాసం ఉంటోంది. ఈ నెల 27న 200 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ సంస్థలో కొనుగోలు చేసింది. విదేశాల్లో ఉంటున్న తన పిల్లల నుంచి వచ్చిన నగదు బ్యాంకుల్లో నాలుగు ఖాతాల్లో జమవుతున్నాయి. ఆ నగదును తీసుకుని బంగారు ఆభరణాలను కొనుగోలు చేసింది. అయితే అవి చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైతే, దాని ఆధారంగా బీమా పొందవచ్చనే పథకం రచించింది. ఈ మేరకు తన ఇంట్లో చోరీ జరిగినట్టు 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా ఇంటి వద్ద సీసీ కెమెరాలు కనిపించకుండా చేసింది. మెయిన్ గేటుకు, లోపల తాళాలు వేసి అర్ధరాత్రి తీసేసింది. ఇంట్లోని వస్తువులను చిందర వందరగా పడేసింది. తనను తాళ్లతో కట్టేసుకుంది. మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసి దాచేసింది. నలుగురు చోరులు ఇదంతా చేసినట్టు ఆమె పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లు దర్యాప్తు చేయగా, చాకచక్యంగా నిజాన్ని నిగ్గు తేల్చినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన కోరుకొండ ఎస్సై ఆర్.అంకారావు, గోకవరం ఎస్సై పవన్‌కుమార్, పోలీసులు రామన్నదొర, నాయుడు, సత్తిరెడ్డి, గోవిందు, యేసు, వీరబాబులకు రివార్డులను అందజేశారు.


