'అంబా' అని అరచినా.. | - | Sakshi
Sakshi News home page

'అంబా' అని అరచినా..

Dec 14 2025 8:35 AM | Updated on Dec 14 2025 1:30 PM

అంబా అని అరచినా..

అంబా అని అరచినా..

పశు వైద్యశాలల్లో వేధిస్తున్న

మందుల కొరత

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి

వచ్చినప్పటి నుంచి సరఫరా నిల్‌

ఏడాదిగా నిబంధనలకు పాతర

నిత్యం అవసరమయ్యే వాటికీ కటకటే

మూడు నెలలకోసారి ఇవ్వాల్సి

ఉన్నా పట్టని వైనం

చేసేది లేక మందులు బయట

కొనుక్కుంటున్న యజమానులు

జిల్లావ్యాప్తంగా సుమారు

3 లక్షలకు పైగా మూగజీవాలు

సాక్షి, రాజమహేంద్రవరం: మూగజీవాలపై సైతం చంద్రబాబు ప్రభుత్వం పచ్చపాతం రూపుతోంది. అధికారంలోకి వచ్చిన తక్షణమే మూగజీవాలకు ఇంటి ముంగిటకే అందే వైద్య సేవలకు మంగళం పాడారు. తాజాగా మూగజీవాలకు అవసరమైన మందులు అందించకుండా సర్యారు నిర్లక్ష్యం చేస్తోంది. ఏడాదిగా జౌషధాల పంపిణీ నిలిపివేయడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నా మందులు మాత్రం బయటకు రాసిస్తున్నారు. దీంతో పశువుల యజమానులపై ఆర్థిక భారం పడుతోంది.

ఇదీ సంగతి..

జిల్లా వ్యాప్తంగా 71 పశువైద్యశాలలు ఉన్నాయి. వివిధ రకాల పశువులు 1,23,668 ఉండగా.. 1,03,598 గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం, మందుల పంపిణీ జరుగుతోంది. జిల్లాలో పాడి పరిశ్రమను నమ్ముకుని వేలమంది రైతులు జీవనం సాగిస్తున్నారు. పాలు విక్రయించి బతుకుబండి లాగుతున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పశువులకు వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుందని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళుతుంటే మందుల కొరత వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు.

ఏడాదిగా అందని మందులు

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు మందులు సరఫరా చేసిన దాఖలాలు లేవు. ప్రతి మూడు నెలలకోసారి సరిపడా స్టాక్‌ సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాడి పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. మరో నెల రోజులు పాటు మందులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. పశువుల సంఖ్య ఆధారంగా రాష్ట్ర పశువైద్య శాఖ మందులు సరఫరా చేయాల్సి ఉంది. లైవ్‌స్టాక్‌ యూనిట్లుగా పరిగణించి డైరెక్టరేట్‌ నుంచే ఏ ప్రాంతానికి ఏ మందులు ఎన్ని అవసరమో ఇండెంట్‌ పెట్టే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించారు. ప్రక్రియ పూర్తయి, మందులు క్షేత్రస్థాయి ఆస్పత్రులకు చేరాలంటే మరో నెల రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు రూ.వేలు ఖర్చు చేసి బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పశుపోషకులు ఆవేదన చెందుతున్నారు.

సంచార వైద్య సేవలపై అక్కసు

పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌లు తీసుకురాగా.. తూర్పుగోదావరి జిల్లాకు 16 అంబులెన్సులు కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 

ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందించారు. అంబులెన్స్‌ సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌ సైతం ఏర్పాటు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువును సమీపంలోని ఏరియా పశువైద్యశాల, వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మరీ వైద్యం అందించారు. తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేర్చేవారు. సేవలు ప్రారంభించిన మూడేళ్లల్లో లక్షల సంఖ్యలో పశువులకు మెరుగైన వైద్యం అందించారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళం పాడింది. దీంతో పశుపోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు పశువులను తీసుకొచ్చి వైద్యం చేయించుకునేందుకు పాట్లు పడుతున్నారు.

అంబులెన్స్‌లో అధునాతన వసతులు
గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అందుబాటులోకి తెచ్చిన పశువుల అంబులెన్స్‌లో అధునాతన వసతులు కల్పించారు. అవసరమైన వైద్య సిబ్బంది నియామకం చేపట్టారు. ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ ఉండేవారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాలను అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. 

అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యం ఉండేది. ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అవసరమైతే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్ర చికిత్స చేసే సౌలభ్యం వాహనాల్లో కల్పించారు.

వ్యవస్థల నిర్వీర్యం

అత్యవసర వైద్య సేవలు అందించే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. తమ డిమాండ్ల సాధన, వేతనాల కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పుడేమో మందులు సకాలంలో సరఫరా చేయకుండా ఇబ్బందులు పెడుతోంది.
-రాజమహేంద్రవరంలోని పశు సంవర్ధకశాఖ జిల్లా కార్యాలయం

అత్యవసర మందులకూ కటకటే..

పశు వైద్యశాలల్లో మందులు నిండుకున్నాయి. అత్యవసర సమయాల్లో వినియోగించే ఔషధాలు కూడా నిల్వ లేని పరిస్థితి తలెత్తింది. పశువులకు ప్రస్తుతం ఎక్కువగా జీర్ణ సంబంధిత ఇబ్బందులు, నొప్పులు, గర్భ సంబంధ సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో వైద్యం తప్పనిసరి. మందుల కొరతతో మూగజీవాలు విలవిల్లాడుతున్నాయి.

అజీర్తి, ఆమ్లజలగ వ్యాధులు, బికోలై ఇన్ఫెక్షన్‌, ఫెర్టిలిటీ, బ్యాక్టీరియా, వైరల్‌ సమస్యలతో అత్యధిక శాతం పశువులను ఆస్పత్రులకు తీసుకొస్తుంటారు. వాటికి చికిత్స చేస్తున్నా వైద్యులు మందులు బయట తెచ్చుకోమని చీటీ రాస్తున్నారు.

ఆసుపత్రులకు ప్రతి మూడు నెలకోసారి మందులు సరఫరా చేయాలి. ఏడీ స్థాయి ఉన్నవాటికి రూ.1.50 లక్షలు, వైద్యాధికారి స్థాయి ఉన్న వాటికి రూ.లక్ష బడ్జెట్‌ ఉండేది. ఇక్కడి నుంచి గ్రామీణ, రైతు సహాయక కేంద్రాలకు అవసరమైన మందులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement