ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
పెద్దాపురం (సామర్లకోట): నవోదయ విశ్వవిద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశానికి 7,140 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం ఉమ్మడి జిల్లాలో 32 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు నవోదయ ప్రిన్సిపాల్ బి సీతాలక్ష్మీ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 6,034 హాజరయ్యారన్నారు.
అన్నవరప్పాడుకు
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన క్యూ లో నిలబడి దర్శనం చేసుకున్నారు. అర్చకులు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కోనసీమ జిల్లా పెదపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి సూర్యావతి కుటుంబం ఇచ్చిన ఆర్థిక సహాయంతో 9,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఎయిర్‌పోర్టులో డ్రై రన్
కోరుకొండ: విమాన సర్వీసుల రాకపోకలకు ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత విమానాశ్రయాల అథారిటీ (ఏఏఐ) ఆధ్వర్యంలో శనివారం మధురపూడిలోని విమానాశ్రయంలో డ్రై రన్ నిర్వహించారు. శీతాకాలంలో పొగమంచు కారణంగా ఏర్పడే అవరోధాలను అధిగమించి విమాన సేవలందించడానికి సంసిద్ధంగా ఉండాలని అధికారులకు ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎన్‌కే శ్రీకాంత్ సూచించారు. ప్రయాణికులకు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సర్వీసుల రాకపోకల్లో అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏటీసీ, ఆపరేషన్లు, ఇంజినీరింగ్, ఏఆర్‌ఎఫ్‌ఎఫ్ విభా గాలకు చెందిన అధికారులతోపాటు, ఇండిగో, అలయన్స్ ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.
స్క్రబ్ టైఫస్‌పై
అపోహలు వద్దు
రాజమహేంద్రవరం రూరల్: స్క్రబ్ టైఫస్‌పై అపోహలు అవసరం లేదని, జిల్లాలో ఆ వ్యాధి వ్యాప్తిలో లేదని, సకాలంలో గుర్తిస్తే నయం అవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే వేంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో ప్రచురితం అవుతున్న వార్తల నేపథ్యంలో ప్రజలకి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు స్క్రబ్ టైఫస్ కేసులు మాత్రమే గుర్తించారని, అవి కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగంగా నిర్ధారణ అయినవేనని తెలియజేశారు. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించదని, జూనోటిక్ వ్యాధి అని తెలిపారు. పొదలు, గడ్డి ప్రాంతాల్లో నివసించే నల్లి లార్వా (చిగ్గర్ మైట్స్) కాటు ద్వారా మాత్రమే మనుషులకు సంక్రమిస్తుందని తెలిపారు. సాధారణ స్పర్శ, దగ్గు, తుమ్ము, మాట్లాడటం ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని వివరించారు.
నేటి నుంచి జాతీయ ఇంధన
పొదుపు వారోత్సవాలు
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 20వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె తిలక్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామన్నారు. 20వ తేదీన రాజమహేంద్రవరం ఎస్‌ఈ కార్యాలయంలో బహుమతుల ప్రదానం నిర్వహిస్తామన్నారు. వినియోగదారులకు స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత, నూతన సాంకేతిక విజ్ఞానం అనే అంశంపై నిపుణులతో ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్క్ షాపులు నిర్వహిస్తారన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత గురించి వినియోగదారులతో అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. జానపద కళాకారులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు.


