పంటలో కలుపుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

పంటలో కలుపుకోవద్దు

Dec 13 2025 7:46 AM | Updated on Dec 13 2025 7:46 AM

పంటలో

పంటలో కలుపుకోవద్దు

ఐ.పోలవరం: రబీ సాగు ఆరంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. చేలల్లో అంతర తామర (ిపిస్టియా స్ట్రేటియోట్స్‌) కలుపు ముప్పుగా మారింది. దీని తొలగింపు రైతులకు వ్యయప్రయాశలతో కూడుకున్న అంశమైంది. ఒకసారి తొలగించిన పంట అవశేషాలు మిగిలిపోవడంతో సాగు ఉన్నంత కాలం తరచూ వస్తుండడంతో రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. జిల్లాలో రబీ వరి సాగు మొదలైంది. ఈ సారి సుమారు 1.65 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని అంచనా. ఖరీఫ్‌ దెబ్బతినడంతో రైతులు రబీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్‌తో పోల్చుకుంటే 45 బస్తాల (బస్తా 75 కేజీలు) నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని రైతులు భావిస్తున్నారు. ఖరీఫ్‌ కోతలు జరిగిన ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్లలో రైతులు రబీ సాగు ప్రారంభించారు. నారుమడులు వేసి నాట్ల కోసం మురగ దమ్ములు మొదలు పెట్టారు. ఖరీఫ్‌కు దూరంగా ఉన్న ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో రైతులు ముందుగానే రబీకి సిద్ధమవుతున్నారు. సాగు ఆరంభంలోనే అంతర తామర (పిస్టియా స్ట్రేటియోట్స్‌) కలుపు రైతులకు ముప్పుగా మారింది. పిస్టియా రకం జాతి తామరలో చిన్న పువ్వుగా ఉంటోంది. ఇది కాలువలు, చేలల్లో త్వరగా విస్తరిస్తోంది. బురద నేల అధికంగా ఉన్నచోట్ల ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో ఇది ఎక్కువగా వస్తోంది. మరీ ముఖ్యంగా ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అమలాపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం మండలాల్లో రైతులకు ముప్పుగా మారింది. మురుగునీటి కాలువల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నచోట్ల ఇది కనిపిస్తోంది. కాలువల ద్వారా చేలల్లోకి వస్తోంది. దమ్ములు చేసిన వారం రోజుల్లో చేలు అంతా విస్తరిస్తోంది. చేలల్లో దీనిని తొలగించేందుకు కూలీలకు రెండు, మూడు రోజులు సమయం పడుతోంది. ఎకరాకు అదనంగా రూ.మూడు వేల వరకూ ఖర్చవుతోంది. ఒకసారి తొలగించినా మళ్లీ మళ్లీ వస్తోందని రైతులు వాపోతున్నారు. సాగు ఆరంభంలో రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని చెబుతున్నారు. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల్లోని పంట కాలువలు, పంట బోదెలలో పెద్ద ఎత్తున పిస్టియా కలుపు మొక్కలు చేరాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మురుగునీటి కాలువల్లో కనీసం గుర్రపుడెక్క, తూడు వంటివి తొలగించకపోవడంతో వాటితోపాటు పిస్టియా కలుపు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దీని ద్వారా చేలల్లోకి వచ్చి చేరుతోంది.

చేలకు నష్టం

ఫ పిస్టియా కలుపు వల్ల పంటకు నష్టం అధికంగా ఉంది. మొదట్లోనే నాట్లు వేసేందుకు ఇబ్బందిగా మారుతోంది. తరువాత వరి మొక్కల మధ్యలో చేరి చేనంతా అల్లుకుపోతోంది. దీనివల్ల చేలలకు అందించే ఎరువుల సారాన్ని ఇదే ఎక్కువగా పీల్చి వేయడం వల్ల వరి మొక్కలకు అందాల్సిన సారం అందుకుండా పోతోంది.

ఫ చేలకు చేసే మందుల పిచికారీ వరి మొక్కల వేర్లకు అందకుండా పోతోంది. పురుగు మందుల సారాన్ని కూడా ఇది పూర్తిగా సేకరిస్తోంది. దీనివల్ల ఇది చనిపోదు కాని, చేలకు పట్టిన పురుగు, తెగుళ్లు తగ్గకుండా చేస్తోంది. పిస్టియా తొలగింపు ఖర్చుతో కూడుకున్న అంశమైతే.. తొలగించకుంటే పంటకు నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు.

మెష్‌లు కట్టడం ద్వారా అరికట్టొచ్చు

వరి చేలల్లో అంతర తామర, పిల్లడుగు, గుర్రపుడెక్క వంటి కలుపు నివారణకు ఎకరాకు 400 గ్రాముల 2, 4–డి సోడియం సాల్ట్‌ 80 శాతం డబ్ల్యూపీని పిచికారీ చేయాలి. లేకుంటే 400 గ్రాముల 2,4–డి అమైన్‌ సాల్ట్‌, లేదా 50 గ్రాముల ఇథాక్సి సల్ఫూయూరాన్‌ 15 శాతం డబ్ల్యూడీజీ లేదా 8 గ్రాముల మెట్సల్ఫ్యూరాన్‌ మిథైల్‌ ప్లస్‌ క్లోరిమురూన్‌ ఇథైల్‌ 20 శాతం డబ్ల్యూపీని పిచికారీ చేయాలి. చేలకు నీరు పెట్టే సమయంలో తూరలకు చిన్న మెష్‌లు కట్టడం ద్వారా పిస్టియా పువ్వు రాకుండా అడ్డుకునే అవకాశముంది.

–ఎం.వాణి, మండల వ్యవసాయ అధికారి, ఐ.పోలవరం

ఫ సాగుకు ముప్పుగా పిస్టియా

ఫ తొలగింపునకు అదనపు భారం

పంటలో కలుపుకోవద్దు1
1/2

పంటలో కలుపుకోవద్దు

పంటలో కలుపుకోవద్దు2
2/2

పంటలో కలుపుకోవద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement