ప్రమాదం మంచుకొస్తోంది!
పగటి ప్రయాణం ఉత్తమం
చుట్టూ కమ్మిన మంచు తెరలతో ఎదుట ఏ వాహనం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ శీతాకాలంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణాలు తగ్గించుకుంటేనే అన్ని విధాలా శ్రేయస్కరం. పగలు ప్రయాణం ఉత్తమం. రాత్రి సమయంలో ముఖ్యంగా తెల్లవారు జామున ప్రయాణించాల్సి వస్తే పూర్తి అప్రమత్తతతో నెమ్మదిగా వెళ్లాలి.
– పి.వీరబాబు, సీఐ, అమలాపురం పట్టణం
అమలాపురం టౌన్: అంతటా మంచు కమ్మేస్తోంది.. రోడ్డంతా దుప్పటిలా పరుచుకుంటోంది.. పొగ మరింత దట్టంగా వ్యాపిస్తోంది.. ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు అటు అనారోగ్యాలకు, ఇటు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. తెల్లవారు జామున మంచు రోడ్లపై కమ్ముకుని కనీసం ఎదురుగా వచ్చే వాహనాల ఉనికి కూడా తెలీయనంతగా ఉంటోంది. కన్నుమూసి తెరిచే లోపు జరగాల్సిన అనర్థం జరిగిపోతోంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ రోడ్లపై ఇదే పరిస్థితి. శుక్రవారం తెల్లవారు జామున అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ప్రమాదానికి మంచే ప్రధాన కారణం. పొగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ఓ బస్సు పల్టీ కొట్టిన ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. శీతాకాలం మొదలయ్యాక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు మంచు వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనల్లో పలువురు మృత్యువాత పడుతుండగా, మరికొంత మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. టూరిస్ట్ బస్సులు, వివిధ సరకుల లోడుతో వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలే ఎక్కువగా మంచు బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, హైవేల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనచోదకులు తగిన అప్రమత్తతతో వ్యవహరిస్తూ వాహనాలను నెమ్మదిగా నడిపితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు.
అప్రమత్తతతో ప్రమాదాలకు చెక్
ఫ మంచు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ వాహనచోదకులు స్వయం నియంత్రణతోనే సాధ్యమవుతుందని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేస్తోంది. కొన్ని జాగ్రత్తలతో ముందుకు వెళితే సురక్షితంగా గమ్యం చేరవచ్చని సూచిస్తోంది.
ఫ అత్యవసరమైతే తప్ప శీతాకాలంలో తెల్లవారు జాము ప్రయాణాలు సాధ్యమైనంత వరకూ మానుకోవాలి. ఎండ వచ్చాక బయలు దేరడం మంచిది. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రయాణాలను పగటి పూటకు వాయిదా వేసుకుంటేనే శ్రేయస్కరం.
ఫ తెల్లవారు జామున రోడ్లపై వెళ్లే వాహనాల లైట్లు నిరంతరాయంగా వెలుగుతూ ఉంచాలి. అప్పుడే ఎదుటి వాహనాలను గుర్తించేందుకు వీలుంటుంది. రోడ్డు మలుపులు వచ్చినప్పుడు వాహన లైట్లను ఆపుతూ, మళ్లీ వేస్తూ ఉంటే ప్రమాదాలను దూరం చేయవచ్చు.
ఫ మంచు సమయంలో వాహనం ప్రయాణిస్తున్నప్పుడు హారన్ మోగిస్తూ ముందుకు సాగాలి. దీనివల్ల ఎదుటి వాహనానికి ఆ శబ్ధం వినిపించి వాహన స్పీడ్‌ను తగ్గించి కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది.
ఫ రాత్రంతా వాహనం ప్రయాణించినా ముఖ్యంగా తెల్లవారు జామున ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో వాహనాన్ని నిలిపివేసి మంచు తగ్గాక తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తే మంచిది.
ఫ ప్రయాణ సమయంలో ముఖ్యంగా వాహన హెడ్ లైట్లు, సిగ్నల్స్ లైట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. వాహనాల బ్రేక్‌లు కూడా చూసుకోవాలి.
ఫ అతి వేగం ఎప్పుడూ అనర్ధమే. పొగ మంచులో వెళుతున్నప్పుడు మాత్రం వాహనం నెమ్మదిగా (30 కిలోమీటర్ల లోపు) ఉంటే శ్రేయస్కరం.
కొత్తపేట రోడ్డులో కమ్ముకున్న మంచు మాటున వాహనాల సంచారం
ఈదరపల్లి– ముక్కామల బైపాస్ రోడ్డులో తెల్లవారుజామున మంచులో ప్రయాణం
ఫ కమ్ముకుంటున్న మంచుతో ఇబ్బంది
ఫ తెల్లవారుజామున
ప్రయాణం అవస్థలమయం
ఫ అప్రమత్తతతోనే ప్రాణాలు భద్రం
ప్రమాదం మంచుకొస్తోంది!


