వేతనాలు పెంచాలి
● యాప్‌ల భారం తగ్గించాలి
● అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు, ఆయాలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ, పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణం రూ.26 వేల కనీస వేతనాన్ని అంగన్‌వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాప్‌ల పేరుతో పెంచిన పని భారాన్ని తగ్గించాలని, అన్నీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేయడాన్ని నిలుపు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం అనంతరం అంగన్‌వాడీ చిన్నారులకు స్నాక్స్ ఇవ్వడం లేదని, దీనిని తక్షణం పునరుద్ధరించి వారికి మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు బడ్జెట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు అనేక హామీలిచ్చి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప, అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా అంగన్‌వాడీల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏకబిగిన 42 రోజుల సమ్మె చేసిన అనుభవం అంగన్‌వాడీలకు ఉందని గుర్తు చేశారు. వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీ ఆయాలు, టీచర్లు, మినీ కేంద్రాల కార్యకర్తలు దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాణిక్యాంబ, బేబీ రాణి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, ఉపాధ్యక్షుడు టి.అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


