జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
● సీఐటీయూ నేతల విజ్ఞప్తి
● నగరంలో రెడ్ మార్చ్
రాజమహేంద్రవరం సిటీ: ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకూ విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాసభల నేపథ్యంలో సీఐటీయూ ఆధ్వర్యాన నగరంలో వివిధ రంగాల కార్మికులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన లేబర్ కోడ్‌లపై కార్మికులందరూ ఐక్యంగా సమరశంఖం పూరించారని అన్నారు. ిసీఐటీయూ ఆవిర్భవించి 55 సంవత్సరాలు పూర్తయిందన్నారు. కార్మిక హక్కుల సాధనతో పాటు దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ అసువులు బాసిన చరిత్ర కార్మికోద్యమానికి ఉందని చెప్పారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రమాదాలను కార్మిక ఉద్యమం ముందుగానే హెచ్చరించిందన్నారు. అయినప్పటికీ పాలకులు తమ స్వార్థం కోసం అమలు చేశారని మండిపడ్డారు. ఫలితంగానే దేశ సంపద కార్పొరేట్ల వద్దకు చేరిపోతోందని చెప్పారు. పారిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, స్కీము వర్కర్ల కోసం చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, కార్మికుల ఐక్యతను చాటిచెప్పేలా విశాఖలో సీఐటీయూ మహాసభలు జరగనున్నాయని అన్నారు. ఈ సభల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సభ అనంతరం పెద్ద సంఖ్యలో కార్మికులు అంబేడ్కర్ బొమ్మ సెంటర్, పుష్కర్ ఘాట్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు మీదుగా శ్యామలా సెంటర్ వరకూ భారీ రెడ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ిసీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుందర్‌బాబు, బి.పవన్, జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, నాయకులు పాల్గొన్నారు.
జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి


