ఇదేం బ్యాగోతం?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘నాసిరకానికి కాదేదీ అనర్హం’ అన్న చందంగా మారింది చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థులకు అందించిన కిట్ల పరిస్థితి. పాఠశాలలు పూర్తయ్యేంత వరకూ ఉండాల్సిన స్కూల్ బ్యాగులు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. అందించిన రెండు నెలలకే జిప్పులు ఊడిపోయాయి. బ్యాగులు చిరిగిపోతోంది. పోనీ కుట్టించుకుని వాడుకుందామన్నా మళ్లీ రోజుల వ్యవధిలో చిరిగిపోతోంది. చేసేది లేక.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంత డబ్బులతో బ్యాగులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
98,853 బ్యాగులు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో జిల్లావ్యాప్తంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కిట్లు పంపిణీ చేశారు. ఒక్కో కిట్‌కు రూ.2,366 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.22.32 కోట్లు వెచ్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ చదివే 98,853 మంది విద్యార్థులకు బ్యాగులు అందించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు ‘బ్యాగో’తం ఇక్కడే బహిర్గతమైంది.
ఇక్కడా కక్కుర్తే..
విద్యార్థులకు నాసిరకం బ్యాగులు ఇచ్చి, చంద్రబాబు సర్కారు కక్కుర్తి చూపిందనే విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన రెండు నెలలకే ఇవి పాడైపోయాయి. జిప్పులు పూర్తిగా ఊడిపోయాయి. బ్యాగులు చిరిగిపోయాయి. దీంతో, వాటిని వీపునకు తగిలించుకుని పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా ఉండకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ పుస్తకాలు పెడితే బ్యాగ్ మొత్తం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగుల్లో 70 శాతం ఇలాగే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. బ్యాగులపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేవిధమైన అభిప్రాయాలు చెప్పారు. అలాగే, తల్లిదండ్రుల సమావేశాల్లో సైతం ఉపాధ్యాయులను, విద్యా శాఖ అధికారులను నిలదీశారు. ఇచ్చిన నెలల వ్యవధిలోనే బ్యాగులు పాడైపోవడమేమిటని ప్రశ్నించారు. దీంతో, నీళ్లు నమిలిన అధికారులు పాడైన బ్యాగ్‌ల స్థానంలో కొత్తవి ఇస్తామని చెప్పారు. ఆవిధంగా కొంత మందికి మాత్రమే ఇచ్చి.. మిగిలిన వారికి పంగనామాలు పెట్టారు. సర్కారు వారి ఈ ఘనకార్యంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడింది. చేసేది లేక చిరిగిపోయిన బ్యాగుల స్థానంలో సొంత డబ్బులతో కొత్తవి కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ కొత్త బ్యాగులే దర్శనమిస్తున్నాయి.
కిట్లలోనూ అయోమయమే..
ప్రభుత్వం అందించిన విద్యార్థి మిత్ర కిట్లలోనూ కనికట్టే చూపారు. బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉండగా.. బూట్ల సైజు చాలా మంది విద్యార్థులకు సరిపోవడం లేదు. ఒక తరగతి విద్యార్థికి ఇవ్వాల్సినవి మరో తరగతి విద్యార్థికి ఇచ్చారు. కిట్‌లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు లేదన్న ఆరోపణలున్నాయి. డిక్షనరీలు, యూనిఫాం, సాక్సులు ఇవ్వలేదు. దీంతో, వాటిని కూడా తల్లిదండ్రులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత ప్రభుత్వంలో నాణ్యమైన కానుక
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘జగనన్న విద్యా కానుక’ పేరిట విద్యార్థులకు నాణ్యమైన బ్యాగ్‌లు, బూట్లు, యూనిఫామ్ అందించేది. ఏటా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే రోజునే 1,31,1194 మంది విద్యార్థులకు ఈ కానుక అందించేవారు.
విద్యార్థులకు నాసిరకం
స్కూల్ బ్యాగుల పంపిణీ
మూడు నెలలకే మూలకు..
జిప్పులు ఊడిపోయి, చిరిగిపోయిన వైనం
70 శాతం బ్యాగులది ఇదే దుస్థితి
20 రోజులకే చిరిగిపోయాయి
చంద్రబాబు ప్రభుత్వం అందించిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన 20 రోజులకే జిప్పులు ఊడిపోవడం, దారాలు రావడం గమనించాం. బ్యాగు పీచులుగా ఊడిపోయింది. నాలుగైదుసార్లు కుట్టించినా.. ఉండటం లేదు. చేసేది లేక తల్లిదండ్రులు మార్కెట్‌లో కొనుగోలు చేసి విద్యార్థులకు ఇచ్చి పంపుతున్నారు. గతంలో ఇచ్చిన బ్యాగులు ఎంతో నాణ్యంగా ఉండేవి. విద్యార్థులకు ఇచ్చే బ్యాగుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కక్కుర్తి చూపడం దారుణం.
– మానుకొండ చంద్రబాబు,
వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
ఇదేం బ్యాగోతం?
ఇదేం బ్యాగోతం?
ఇదేం బ్యాగోతం?


