పంచాయతీ కార్మికుడి దుర్మరణం
రాజానగరం: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో స్థానిక పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఫరిజల్లిపేటకు చెందిన కొత్తపల్లి శ్రీను (43) రాజానగరం పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పనులు ముగించుకుని, సహ కార్మికుడు నీలాపు వీరన్నను డ్యూటీకి పిలిచేందుకు మరో కార్మికుడు చంద్రమళ్ల వీర్రాజుతో కలసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు మీదుగా ప్రయాణించి, అవతలి వైపునకు వెళ్లేందుకు వైఎస్సార్ జంక్షన్‌లో ఆగి ఉన్నారు. అదే సమయంలో రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు మలుపు తిరుగుతున్న లారీ ఆ మోటార్‌సైకిల్‌ను ఢీకొని, వెనుక కూర్చున్న శ్రీనును కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. తీవ్రంగా గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడు. మోటారు సైకిల్ నడుపుతున్న వీర్రాజు గాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య మరియమ్మ, 13 సంవత్సరాల అమ్మాయి ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. వారం రోజుల క్రితం ఇదే జంక్షన్‌లో బైక్‌పై ఆగివున్న యువ జంట మృత్యువాత పడింది.
పంచాయతీ కార్మికుడి దుర్మరణం


