ఫెర్రీ.. వర్రీ.. | - | Sakshi
Sakshi News home page

ఫెర్రీ.. వర్రీ..

Dec 10 2025 7:39 AM | Updated on Dec 10 2025 7:39 AM

ఫెర్ర

ఫెర్రీ.. వర్రీ..

సఖినేటిపల్లి రేవులో పంటు ఫిట్‌నెస్‌పై సర్వత్రా ఆందోళన

ఇటీవల నది మధ్యలో నిలిచిన వైనం

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

సఖినేటిపల్లి: నర్సాపురం – సఖినేటిపల్లి మధ్యలోని వశిష్ట గోదావరిలో పంటుపై ప్రజలు, విద్యార్థులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇది అక్కడి వారందరూ సాధారణ విషయమే. అయితే ఇటీవల నది మధ్యలో పంటు నిలిచిపోయిన ఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పంటు ఫిట్‌నెస్‌పైనా సందేహాలు తలెత్తుతున్నాయి. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రమాదం తప్పిందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అటు ఉమ్మడి పశ్చిమ, ఇటు తూర్పు గోదావరి జిల్లాల ఉన్నతాధికారులు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాధవాయిపాలెం ఫెర్రీగా సఖినేటిపల్లి – నర్సాపురంలో రేవు గుర్తింపు పొందింది.

నది మధ్యలో..

నర్సాపురం వైపు నుంచి సఖినేటిపల్లి వైపునకు సుమారు 80 మంది ప్రయాణికులు, 20 వాహనాలతో బయలుదేరిన పంటులో ఇంజిన్‌ సమస్య తలెత్తింది. దీనికి తోడు సముద్ర ఆటుపోట్ల కారణంగా గోదావరిలోకి వచ్చే కెరటాల ధాటికి నదిలో దిశ మారింది. ఈ నేపథ్యంలో అరగంట పాటు నిలిచిన పంటుపై ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ తరుణంలో నిర్వాహకులు ఆ పంటుకు ఇదే రేవులో ప్రయాణికులతో వస్తున్న మరో పంటుకు తాడును కట్టి సఖినేటిపల్లి వైపు గోదావరి ఒడ్డుకు చేర్చారు.

పర్యవేక్షణ కరవు

వేలంలో రేవు పాట దక్కించుకున్న నిర్వాహకులు ప్రయాణికుల రాకపోకలకు ఏర్పాటు చేయబోయే పంటులను ఆ శాఖ అధికారులు పరిశీలన చేసి సర్టిఫికెట్‌ ఇస్తారు. ఈ క్రమంలో సెక్యూరిటీ మెజర్స్‌ పరిశీలనకు కాకినాడలోని ఏపీ మారిటైమ్‌ బోర్డు (ఓడల రేవులు, సముద్ర మౌలిక సదుపాయాల నిర్వహణ) అధికారులు ఇందుకు అథారిటీ ఉంటారు. నర్సాపురం ఎంపీడీవో పర్యవేక్షణలో రేవు నిర్వహణ కొనసాగుతుంది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటీవల ఇంజిన్‌ మొరాయించి నది మధ్యలో పంటు నిలిచిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

కనీస జాగ్రత్తలు ఏవీ!

సఖినేటిపల్లి రేవులో ప్రయాణికుల నుంచి సాలీనా సుమారు రూ.3 కోట్ల వరకూ పాటదారులు వసూలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రేవులో వేలం ద్వారా ఖరారవుతున్న పాట మొత్తంలో ఎక్కువ శాతం ఆదాయం ఇచ్చేది రాజోలు దీవివాసులే. కానీ పాటదారులు కనీస సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోకపోవడం శోఛనీయమని స్థానికులు విమర్శిస్తున్నారు.

పెత్తనమంతా పశ్చిమదే

రేవుపై పెత్తనమంతా పశ్చిమ గోదావరి జిల్లా అధికారులదే. దీంతో రేవు పాట ద్వారా వచ్చే ఆదాయంలో వాటాలకు మాత్రమే తూర్పు జెడ్పీ, సఖినేటిపల్లి మండల పరిషత్‌, సఖినేటిపల్లిలంక (రేవు ఉన్న ప్రాంతం) పరిమితం అయింది.

కూతవేటు దూరం

సాగర సంగమానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రేవులో సముద్రం ఆటుపోటులకు గోదావరి వైపునకు పోటెత్తే కెరటాలు ఽప్రభావం రేవులో అధికంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కెరటాలు దాటికి పంటు అదుపు తప్పి దిశ మారడం జరిగి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఉన్న రేవులో అధికారుల ఉదాసీన వైఖరి, రేవు పాటదారుల నిర్లక్ష్యం తగదని ప్రయాణికులు పేర్కొన్నారు.

నిత్యం వేల సంఖ్యలో

నిత్యం వేల సంఖ్యలో ఈ రేవు నుంచి నర్సాపురంతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తారు. రోడ్డు మార్గంలో నర్సాపురం వెళ్లడానికి చించినాడ మీదుగా చుట్టూతిరిగి సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అయితే సఖినేటిపల్లి రేవులో పంటు మీదుగా అరగంటలో నర్సాపురం చేరుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి రేవును ఆశ్రయించడం పరిపాటి.

నిర్వహణ లోపం

నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రేవులో పంటు నది మధ్యలో నిలిచిపోయిన ఘటనలో నిర్వహణ లోపం కచ్చితంగా కనబడుతోంది. అలాగే పంటు ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరికీ అనుమానం ఉంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.

– బళ్ల నోబుల్‌ ప్రభాకర్‌, పరిషత్‌ కో

ఆప్షన్‌ మెంబర్‌, సఖినేటిపల్లి

అజమాయిషీ ఉండాలి

రేవులో పంటు ఫిట్‌నెస్‌, నిర్వహణపై ఉన్నత అధికారుల అజమాయిషీ కచ్చితంగా ఉండాలి. నిత్యం ప్రయాణికులతో పాటు చదువు కోసం విద్యార్థులు రేవు మీదుగా నర్సాపురానికి రాకపోకలు సాగిస్తుంటారు. వారి భద్రతపై ఉదాసీన వైఖరి తగదు.

– తాడి సహదేవ్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి, వీవీ మెరక

ఫెర్రీ.. వర్రీ..1
1/3

ఫెర్రీ.. వర్రీ..

ఫెర్రీ.. వర్రీ..2
2/3

ఫెర్రీ.. వర్రీ..

ఫెర్రీ.. వర్రీ..3
3/3

ఫెర్రీ.. వర్రీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement