అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు
● మరో ఇద్దరిపై కేసు నమోదు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్
ముమ్మిడివరం: ముమ్మిడివరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మోర్త గిరిబాబుతో పాటు మరో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ నిందితులను మీడియా ముందు హాజరు పర్చి, కేసు వివరాలు వెల్లడించారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన బాలిక ఐదో తరగతి నుంచీ ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో చదువుకుంటోంది. ఆమె తల్లి జీవనోపాధి కోసం కువైట్‌లో ఉంటుండగా, తండ్రి కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆ బాలిక నాయనమ్మ ఇంటి వద్ద ఉంటూ గురుకులంలో చదువుకుంటోంది. ఈ క్రమంలో బాలికతో బాబాయి వరసయ్యే అదే గ్రామానికి చెందిన మోకా గిరిబాబు పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 3న గురుకుల పాఠశాలలో ఉన్న ఆ బాలికను వైద్య చికిత్స కోసం బయటకు తీసుకు వెళుతున్నానని పాఠశాల యాజమాన్యంతో చెప్పగా, వారు నిరాకరించారు. దీంతో గిరిబాబు సమీప బంధువైన మేడేపల్లి అర్చనాదేవి ఆ పాఠశాలకు వెళ్లి ఆ బాలికకు మేనత్తనంటూ మాయమాటలు చెప్పి బయటకు తీసుకు వచ్చింది. గతంలో బాలిక తండ్రితో గిరిబాబు పలు పర్యాయాలు గురుకుల పాఠశాలకు రావడం, ఆ బాలిక కూడా గిరిబాబును బాబాయి అనడంతో యాజమాన్యం నమ్మి, బయటకు పంపించింది.
అధిక సొమ్ములు ముట్టజెప్పి..
గిరిబాబు ఆ బాలికతో పాటు అర్చనాదేవిని మోటారు సైకిల్‌పై ముమ్మిడివరం వరకూ తీసుకువచ్చాడు. అక్కడ అర్చనాదేవిని దించి బాలికను గౌరీపట్నం తీసుకువెళ్లాడు. అదే రోజు సాయంత్రం అమలాపురం చేరుకుని స్థానిక గణపతి లాడ్జిలో రిసెప్షనిస్టు నాగవరపు వెంకట రమణకు అధిక సొమ్ములు ముట్టజెప్పి గది తీసుకున్నాడు. ఆ రాత్రి బాలికపై రెండుసార్లు అత్యాచారం చేశారు. మరుసటి రోజు బాలికను గురుకుల పాఠశాల వద్ద వదిలేశాడు. పాఠశాల ప్రిన్సిపాల్ డి.శారద ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ఎస్సై డి.జ్వాలా సాగర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితుడు గిరిబాబుపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అతడికి సహకరించిన అర్చనాదేవి, నాగవరపు వెంకట రమణలను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కాగా.. బాలిక నాయనమ్మ ఇంటి సమీపంలోనే గిరిబాబు ఉంటున్నాడు. బాలిక తండ్రితో ఉన్న పరిచయంతో లోబర్చుకున్నాడు. సెలవుల సమయంలో ఇంటి వద్ద ఉన్న ఆ బాలికపై పలు పర్యాయాలు అత్యాచారం చేశాడు.


