గిరిజనుల హక్కులను కాపాడాలి
సామర్లకోట: గిరిజనుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని ఎంపీడీఓలకు మంగళవారం ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు వారి హక్కులపై అవగాహన కల్పించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు 24వ తేదీలోపు గిరిజనులకు పెసా చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఈ మేరకు స్థానిక శిక్షణా కేంద్రంలో సీఈఓలు, డీపీఓలు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు టీఓటీలుగా శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ నెల 12 నుంచి 14 వరకు డిప్యూటీ ఎంపీడీలకు, ఈ నెల 15 నుంచి 17 వరకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి పంపాలన్నారు. ఈ నెల 24న విశాఖపట్నంలో జాతీయ పెసా దినోత్సవం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెసా కోర్సు డైరెక్టర్ డి.చిన్నబ్బులు, అసిస్టెంట్ కోర్సు డైరెక్టర్ కేఆర్ నిహారిక, ఫ్యాకల్టీలు కె.సుశీల, ఎం.రాజ్ కుమార్, ఎన్‌ఎన్ రాజ్‌కుమార్, ఎ.విజయ్ కుమార్ పాల్గొన్నారు.


