ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా
పెరవలి: ఏటిగట్టుపై మలుపు తిరుగుతున్న ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. దానిలోని 40 మంది విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉండ్రాజవరం మండలం తాటిపర్రు గ్రామానికి చెందిన జ్యోతి కాన్వెంట్ బస్సు మంగళవారం పెరవలి మండలం తీపర్రులో గోదావరి ఏట్టుగట్టుపై మలుపు తిరుగుతోంది. ఆ సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా లంకలోకి బోల్తా పడింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు పరుగున అక్కడకు వెళ్లి, బస్సు అద్దాలను పగులకొట్టి, విద్యార్థులకు బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆయా ర్యాలి వెంకట పద్మావతికి తీవ్ర గాయాలు కావడంతో సొమ్మసిల్లిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొందరు పిల్లలకు స్వల్ప గాయాలు కావటంతో తల్లితండ్రులు, స్థానికులు సపర్యలు చేశారు. పెరవలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్, స్కూల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా.. దాదాపు నెల రోజులుగా బస్సు సమయానికి రావడం లేదని, ఎందుకుని ప్రశ్నిస్తే బస్సు రేపేరుకు వచ్చిందంటూ డ్రైవర్ వెంకట రమణ చెప్పేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు.
ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా


