కాకినాడలో వ్యక్తి దారుణ హత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన కీర్తి సత్యనారాయణ (45) స్థానిక సంత చెరువు జంక్షన్‌లోని దుర్గ గుడి మలుపులో చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. దుమ్ములపేటకు చెందిన అత్తిలి రంగా అనే ఆటో డ్రైవర్ మంగళవారం సత్యనారాయణ వద్దకు వచ్చి ఘర్షణ పడ్డాడు. నిన్న రాత్రి తన తల్లిని ఎందుకు దూషించావని ప్రశ్నించాడు. ఈ విషయంపై ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతలోనే రంగా అక్కడే ఉన్న చెప్పులు కుట్టేందుకు వాడే కత్తితో సత్యనారాయణ గుండెల్లో పొడిచాడు. వెంటనే సత్యనారాయణ రక్త మోడుతూ కాకినాడ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనపై జరిగిన దాడి గురించి చెబుతుండగా ముందుగా ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో తాను సహజీవనం చేస్తున్న మేరీ అనే మహిళ సాయంతో కాకినాడ జీజీహెచ్‌కు ఆటోలో వెళుతుండగా మార్గం మధ్యలో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లే సరికి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ బిందుమాధవ్, ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్‌తో కలిసి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడికి కుటుంబం లేదు. కొన్నాళ్ల క్రితం రేచర్లపేటకు చెందిన మేరీతో పరిచయం ఏర్పడింది. ఆమె చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవితం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో సత్యనారాయణ కూడా ఆమెతో కలిసి కాగితాలు ఏరుకుంటూ, చెప్పులు కుడుతూ ఆమె కు దగ్గరయ్యాడు. ఈ పరిచయం ఇరువు రి మధ్య సహజీవనానికి దారి తీసింది. నిందితుడు రంగాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.


