హత్యకు పాత కక్షలే కారణం
పోలీసుల అదుపులో నిందితుడు
గండేపల్లి, జగ్గంపేట: హత్య కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ నెల 5న కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. 2024లో జరిగిన ఘర్షణలో కాకర అప్పారావుపై కుళ్ల రాజాబాబు దాడి చేయడంతో అప్పటి నుంచి వారి మధ్య కక్షలు కొనసాగుతున్నారు. భూపాలపట్నంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి అప్పారావు ఒంటరిగా కనిపించడంతో కుళ్ల రాజాబాబు అతని తమ్ముడు కుళ్ల నాగేశ్వరరావుతో కలసి అక్కడకు వెళ్లగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సమీపంలోని ఇనుప రాడ్లతో అప్పారావుపై దాడి చేసి హతమార్చి రాడ్లను అక్కడే వదిలి వారు పరారయ్యారు. ప్రధాన నిందితుడు రాజాబాబును సోమవారం ఉదయం హైవేలో బూరుగుపూడి నుంచి జగ్గంపేట వెళ్లే మార్గంలో రామవరం వద్ద అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. అతన్ని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు కుళ్ల నాగేశ్వరరావు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఏఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


