సీటొస్తే నవోదయమే | - | Sakshi
Sakshi News home page

సీటొస్తే నవోదయమే

Dec 9 2025 9:22 AM | Updated on Dec 9 2025 9:22 AM

సీటొస

సీటొస్తే నవోదయమే

ఉజ్వల భవిత, ఉన్నత ప్రమాణాలకు బాట

13న నవోదయ ప్రవేశ పరీక్ష

32 కేంద్రాల్లో నిర్వహణ, 7,140 మంది హాజరు

రాయవరం: ఉన్నత ప్రమాణాలతో విద్య.. క్రీడల్లో ప్రత్యేక తర్ఫీదు.. సాహస కృత్యాలు.. వివిధ అంశాల్లో అధునాతన శిక్షణ.. పౌష్టికాహారంతో బోధన అందించే కేంద్రాలుగా జవహర్‌ నవోదయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ఇందులో ప్రవేశాల కోసం ఏటా వేలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఒకసారి ఆరో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్‌ వరకూ విలువలతో కూడిన ఉచిత విద్య లభిస్తుంది. నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13వ తేదీ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పెద్దాపురం జవహర్‌ నవోదయ విద్యాలయం ఉంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను ఈ నెల 13న నిర్వహించనున్నారు. 80 సీట్లకు 7,140 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. కరోనా నేపథ్యంలో 2021లో 5,371 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, 2022లో 10,741 మంది, 2023లో 8,779 మంది, 2024లో 8,506 మంది, 2025లో 8,971 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది గతేడాది కంటే 1,831 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. పరీక్షల అనంతరం విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లను మూల్యాంకనం నిమిత్తం ఢిల్లీకి పంపిస్తారు. అక్కడే విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో 12, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో అవసరమైన చీఫ్‌ సూపరింటెండెంట్లు, డీఓలు, ఇన్విజిలేటర్ల నియామకం చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.

80 ప్రశ్నలు.. 100 మార్కులు

ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలకు వంద మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, గణితంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు, భాషా పరిజ్ఞానంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయించారు. విద్యార్థులు ఉదయం 10.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 10.45 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుంది. ఆలస్యంగా కేంద్రానికి చేరుకుంటే పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

విద్యార్థులకు సూచనలివీ..

విద్యార్థులు రెండు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక హాల్‌ టికెట్‌ను ఇన్విజిలేటరుకు అందించాలి. ఏదో ఒక గుర్తింపు కార్డును విద్యార్థి వెంట తీసుకు వెళ్లాలి. బ్లూ లేదా బ్లాక్‌ పెన్నుతోనే పరీక్ష రాయాలి. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులు పాఠశాల యూనిఫామ్‌, లేదా సివిల్‌ డ్రస్‌లో హాజరు కావచ్చు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు వెంట తీసుకురాకూడదు.

సిబ్బంది నియామకం పూర్తి

నవోదయ ప్రవేశ పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం పూర్తి చేశాం. ఇప్పటికే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల తో పరీక్షను సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించే విషయంపై చర్చించాం. పరీక్ష కేంద్రాల సీఎస్‌, డీవో, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేశాం. ఈ నెల 11న సీఎస్‌, డీవోలకు శిక్షణనివ్వనున్నాం. సెంటర్‌ లెవల్‌ అబ్జర్వర్లను నియమించి శిక్షణ ఇస్తున్నాం.

–బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్‌,

జవహర్‌ నవోదయ విద్యాలయ, పెద్దాపురం

పారదర్శకంగా నిర్వహిస్తాం..

నవోదయ ప్రవేశ పరీక్షను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు డీఈఓలకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

–జి.నాగమణి, పాఠశాల విద్యాశాఖ, ఆర్జేడీ, కాకినాడ

జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలు, హాజరయ్యే విద్యార్థులు

జిల్లా పరీక్ష దరఖాస్తు చేసిన

కేంద్రాలు విద్యార్థులు

కోనసీమ 15 3,046

తూర్పు 05 1,014

గోదావరి

కాకినాడ 12 3,080

మొత్తం 32 7,140

సీటొస్తే నవోదయమే1
1/2

సీటొస్తే నవోదయమే

సీటొస్తే నవోదయమే2
2/2

సీటొస్తే నవోదయమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement