మాదిగలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి
ఫ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, మాదిగ నేతల డిమాండ్
ఫ 11న ఆత్మీయ కలయికకు సన్నాహాలు
అమలాపురం టౌన్: మాదిగలు చట్టసభల్లోకి వెళ్లేందుకు అన్ని రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తోనే అమలాపురం పట్టణం కొంకాపల్లి శ్రీసత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 11న జిల్లా స్థాయి మాదిగల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాదిగ నేతలు వెల్లడించారు. స్థానిక ప్రీతి రెసిడెన్సీ సమావేశ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, మాదిగ నేతలు మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర నిర్వహించినప్పుడు మాదిగలను చట్టసభలకు పంపిస్తానని ఇచ్చిన హామీని తాను అధికారంలోకి వచ్చాక తనతోపాటు నందిగం సురేష్‌ను ఎమ్మెల్సీ, ఎంపీలను చేసి చట్టసభలకు పంపించారని ఇజ్రాయిల్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే కాకుండా ఇప్పుడు కూడా మాదిగలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు. మాదిగలకు చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చి జగన్ మాదిరిగా చరిత్రలో మిగిలిపోతారో... లేక చరిత్ర హీనులుగా నిలుస్తారో తేల్చుకోవాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్‌గా ఒక ఎంపీ స్థానం, మూడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయని, వీటిలో రెండు స్థానాలు మాదిగలకు కేటాయించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 11న నిర్వహించే ఆత్మీయ కలయికకు జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి సైతం మాదిగ నాయకులు, వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారని చెప్పారు. అందరూ ఆత్మీయంగా కలసి తమ జాతి ఐక్యతను చాటనున్నామన్నారు. అనంతరం ఆత్మీయ కలయిక కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో మాదిగ నాయకులు యార్లగడ్డ రవీంద్ర, మడికి శ్రీరాములు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నాయకులు దంసూరి, సవరపు భైరవమూర్తి, నూతికుర్తి సత్యనారాయణ, ఆకుమర్తి మోహన్, మంద రామకృష్ణ, ఖండవల్లి ఏసయ్య, గంపల ప్రసాద్, పెదపూడి శ్రీను, నేదునూరి నతానియేలు, కొమరవీర రాఘవులు, కాప నాగరాజు పాల్గొన్నారు.


