మంత్రి బంధువులమంటూ బెదింపులు
ఫ భూముల కబ్జా యత్నంపై తల్లీ కుమార్తె ఆవేదన
ఫ న్యాయం చేయాలని మంత్రి సుభాష్ కాళ్లు పట్టుకున్న వైనం
అమలాపురం రూరల్: మంత్రి బంధువులమంటూ బెదిరిస్తూ తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాళ్లు పట్టుకుని తల్లీకుమార్తె ప్రాధేయపడ్డారు. ఆస్తి వివాదంలో తమకు న్యాయం చేయాలని గుత్తుల పుణ్యవతి, మట్టపర్తి లక్ష్మీప్రసన్న మొరపెట్టుకున్నారు. సోమవారం అమలాపురం భట్నవిల్లిలో ఓ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ రాగా, ఆయన కాళ్లు పట్టుకుని ఆ తల్లీ కుమార్తె ఏడ్చిన దృశ్యాలు అందిరినీ కలచివేశాయి. తన భర్త గుత్తుల వెంకట్రావు జీవించి ఉండగానే తనకు, కూతురు లకీ్‌ష్మ్‌ప్రసన్న పేరున కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని ఒక సర్వే నంబర్‌లో 1–42 ఎకరాలు, మరో సర్వే నంబర్‌లో 51 సెంట్ల భూములు రాయించి ఇచ్చారని అని పుణ్యవతి తెలిపారు. కానీ మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో పెంచుకున్న కూతురు, ఆమె భర్త కలసి ఈ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని పుణ్యవతి, లకీ్‌ష్మ్‌ప్రసన్న ఆరోపిస్తున్నారు. కొత్తపాలెం రికార్డుల్లో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి, తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు. తమ కొబ్బరి తోటలో దింపు తిస్తుండగా అడ్డుకుని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారని బాధితులు మంత్రికి వివరించారు. దాడులు చేసిన కుడిపూడి వెంకటరత్నం, వెంకటేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఫిర్యాదు చేసినా న్యాయం దొరకలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.


