జగన్ ఆలోచనకే పవన్ ఆలోచనగా కలరింగ్
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ) కార్యాలయాలను ప్రారంభిస్తూ, అవి తన ఆలోచన నుంచి పుట్టాయంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రబుత్వం ప్రారంభించిన డీఎల్‌డీఓ కార్యాలయాలను డీడీఓ కార్యాలయాలుగా మార్చారే తప్ప ఇందులో కొత్తదనం గాని, విధివిధానాలు గాని, ఆర్థిక వనరులు సమకూర్చడం గాని లేవని అన్నారు. అబద్ధపు మాటలతో ప్రజలను చంద్రబాబు సర్కార్ ఏవిధంగా ఏమార్చుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. వాస్తవానికి ఎంపీడీఓలకు 33 ఏళ్లుగా ఉద్యోగోన్నతులు లేవని, దీంతో, వారికి ప్రమోషన్లు కల్పించేందుకు గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 2020 సెప్టెంబరు 30న డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీఎల్‌డీఓ) వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవ చూపి గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకునేలా డీఎల్‌డీఓ పోస్టులను ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక డీఎల్‌డీఓ కార్యాలయం ఏర్పాటు చేసిందని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. ప్రజావసరాలు తీర్చడానికి వారికి చేరువగా వైఎస్ జగన్ పాలన సాగిందన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన డీడీఓ కార్యాలయాలన్నింటినీ గ్రామ సచివాలయాల భవనాల పై అంతస్తుల్లోనే ఏర్పాటు చేశారని చెప్పారు. గతంలో గ్రామ సచివాలయాలు నిర్మిస్తూంటే పంచాయతీలుండగా ఇవెందుకని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అన్నారని గుర్తు చేశారు. వాస్తవానికి నోడల్ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను చంద్రబాబే నిర్వీర్యం చేశారని అన్నారు. తద్వారా సర్పంచ్‌ల అధికారాలను సైతం హరించారన్నారు. డీఎల్‌డీఓ వంటి గొప్ప వ్యవస్థను జగన్ తీసుకుని వస్తే.. దానిపై విషం చిమ్మి, ఇప్పుడు మళ్లీ దానినే పవన్ ప్రారంభించి, తన ఆలోచనగానే కలరింగ్ ఇవ్వడమేమిటని వేణు ప్రశ్నించారు. ప్రజల మనసులో ఉండాలనుకుంటే వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్ కూడా పాల్గొన్నారు.
ఫ డిప్యూటీ సీఎంపై
మాజీ మంత్రి వేణు విమర్శ
ఫ డీఎల్‌డీఓనే డీడీఓగా మార్చారంతే..
ఫ ఈ వ్యవస్థ తెచ్చింది వైఎస్సార్ సీపీ
ప్రభుత్వమేనని స్పష్టీకరణ


