ధర్మదేవత, యమధర్మరాజు ఒక్కరే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మ దేవత, యమధర్మరాజు ఒక్కరేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ స్పష్టం చేశారు. వ్యాస భారత ప్రవచనాన్ని హిందూ సమాజంలో శనివారం ఆయన కొనసాగించారు. ‘భార్యతో కలిస్తే ముని శాపం వలన పాండురాజుకు మృత్యువు కలుగుతుంది. సంతానహీనునికి సద్గతులు కలగవు. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రం అనేక ఆపద్ధర్మాలను పేర్కొంది. భర్త అనుమతితో కుంతి తాను దుర్వాసుని వర ప్రభావంతో పొందిన మంత్రాలను ఉపాసించి సంతానవతి అయింది. ధర్మం, బలం, ఐశ్వర్యం, సౌందర్యం తదితర అంశాలలో ధర్మానిదే ప్రథమ స్థానం. అధర్మంతో ఏదీ సాధించలేరు కనుక, పాండురాజు ఆదేశంపై కుంతి ధర్మదేవతను ఉపాసించి, యుధిష్ఠిరుని తొలి సంతానంగా అందుకుంది. పాండురాజు ఆదేశం పైనే వాయుదేవుని ఉపాసించి భీముని, ఇంద్రుని ఉపాసించి అర్జునుని సంతానంగా పొందించి. మాద్రి అశ్వనీ దేవతలను ఉపాసించి నకుల సహదేవులను సంతానంగా అందుకుంది. ధృతరాష్ట్ర సంతానంగా మొదట దుర్యోధనుడు జన్మించినప్పుడు అనేక వైపరీత్యాలు గోచరించాయి. గాడిదలు, నక్కలు, గెద్దలు వికృతంగా అరిచాయి. ధృతరాష్ట్రుని హితైషులందరూ పెద్ద కొడుకును విడిచిపెడితే, మిగతా 99 మంది సుఖంగా జీవిస్తారని, లేకపోతే వంశ నాశనమవుతుందని హెచ్చరించారు. కులం బాగు కోసం అవసరమైతే ఒకడిని వదిలేయాలి. గ్రామం బాగు కోసం అవసరమైతే కులాన్ని వదిలేయాలి. దేశ క్షేమం కోసం గ్రామాన్ని, అలాగే తన క్షేమం కోసం అవసరమైతే యావత్తు పృథ్విని వదిలేయాలని హితవు చెప్పినా ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు’ అని సామవేదం వివరించారు. ఈ సందర్భంగా మహాపతివ్రత గాంధారిని గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన అంశాలను వివరించారు. తన భర్త చూడలేని లోకాన్ని చూడటం ఇష్టం లేక ఆమె కళ్లకు గంతలు కట్టుకున్నదన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ధృతరాష్ట్రునికి చూపు లేదన్న దోషాన్ని ఎంచకూడదనే ఆమె కళ్లకు గంతలు కట్టుకున్నదన్నారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులు పురాణవైర గ్రంథాల్లో భారత కాలాన్ని, చారిత్రక వాస్తవాలను వెల్లడించారని, హిందూ మతం శాసీ్త్రయమైనదని, ఖగోళ గమనాన్ని అనుసరించి భారత కాలగణనం జరిగిందని చెప్పారు. పాశ్చాత్య ఉపాసకులైన పాలకుల చేతిలో చరిత్ర వక్రీకరణకు గురి కావడం మన దురదృష్టమని సామవేదం ఆవేదన వ్యక్తం చేశారు.


