పోలీసు శాఖలో హోంగార్డులు అంతర్భాగం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసు శాఖలో హోం గార్డులు అంతర్భాగమని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన హోంగార్డ్స్ రైజింగ్ డే పరేడ్‌కు ఎస్పీ హాజరయ్యారు. పరేడ్ కమాండర్ ఆర్‌ఐ పీవీ అప్పారావు ఆధ్వర్యాన హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, ఎస్పీ మాట్లాడుతూ, హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తున్నారని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా ధృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. ఉత్తమ పనితీరు కనబరిచిన బీఎస్‌ఎస్ ఉపేంద్ర పవన్, పి.వెంకట రమణ, వీజీ చౌదరి, జీఎస్‌ఎస్ ప్రకాష్, జి.ప్రవీణ్ కుమార్, సీహెచ్‌వీ సుబ్రహ్మణ్యంలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఇద్దరు రిటైర్డ్ హోంగార్డులకు, జిల్లా యూనిట్ హోంగార్డులు ఒక రోజు జీతాన్ని చెక్కు రూపంలో అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, చెంచిరెడ్డి, జోనల్ డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


