భార్యను హత్య చేసిన నిందితుడి అరెస్ట్
యానాం: పట్టణ పరిధిలోని బళ్లావారివీధిలో సోమవారం అర్ధరాత్రి పెమ్మాడి దీనాను హత్య చేసి పరారైన ఆమె భర్త పెమ్మాడి నానిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ వరద రాజన్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీనాను వివాహం చేసుకున్న అనంతరం నిందితుడు పెమ్మాడి నాని ఎటువంటి పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ ఖాళీగా తిరుగుతుండేవాడని అన్నారు. దీనికి తోడు దీనాను తీవ్రంగా కొట్టడం, హింసించడం, అనుమానించడం చేసేవాడన్నారు. ఈ నేపథ్యంలో దీనా అతడికి దూరంగా యానాంలో అద్దెకు ఉంటూ టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. కాగా.. నాని ఆమె ఇంటికి వెళ్లి పీక నులిమి హత్య చేశాడన్నారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందన్నారు. సమావేశంలో సీఐ అడలరసన్, ఎస్సైలు పునీత్ రాజ్, శేరు నూకరాజు పాల్గొన్నారు.


