చలమలశెట్టి సునీల్‌కు పితృవియోగం
ఫోన్‌లో పలకరించిన మాజీ సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రముఖ వ్యాపారవేత్త చలమలశెట్టి సునీల్ తండ్రి, డాక్టర్ చలమలశెట్టి సురేంద్రనాథ్ మంగళవారం మృతి చెందారు. కాకినాడ ఈఎస్‌ఐ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆయన వైద్యుడిగా పనిచేశారు. సురేంద్రనాథ్‌కు భార్య వెంకటలక్ష్మి, సునీల్, అనిల్‌కుమార్, వెంకటేష్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మచిలీపట్నంలో సురేంద్రనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు కుమారుల్లో అనిల్‌కుమార్ గ్రీన్ కో సీఎండీగా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సునీల్‌ను బుధవారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పలకరించారు.
నేడు రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు
దేవరపల్లి: దుద్దుకూరులోని రంగరాయ జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం రాష్ట్ర స్థాయి అండర్ – 17 బాల, బాలికల సెపక్ తక్రా పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రధానోపాధ్యాయుడు వీర్రాజు తెలిపారు. ఉదయం 8 గంటలకు ఈ పోటీలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు.
సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకంలో భాగంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంఘం లిమిటెడ్, కార్యనిర్వాహక సంచాలకులు జె.సత్యవతి ఈ విషయాన్ని మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం, ప్రగతి భవన్, జనరల్ ఆసుపత్రి ఎదురుగా, కాకినాడ అనే చిరునామాకు పోస్టులో లేదా వ్యక్తిగతంగా అందజేయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 62818 17023 నంబర్‌నుసంప్రదించాలని కోరారు.
మహిళను మోసం చేసిన యువకుడిపై కేసు
నల్లజర్ల: ప్రేమ పేరుతో మహిళను నమ్మించి, మోసం చేసిన యువకుడిపై నల్లజర్ల పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తెలికిచెర్లకు చెందిన ఓ వివాహిత తన భర్తతో విభేదించి మూడేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఆమెను అదే గ్రామానికి రామాంజనేయులు ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. గర్భం దాల్చిన ఆమె వివాహం చేసుకోవాలని అడగ్గా రామాంజనేయులు ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు నల్లజర్ల పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ధవళేశ్వరం: రైలు ఢీకొని ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యాక్టరీ సమీపంలో హైవే బ్రిడ్జి కింద బుధవారం మధ్యాహ్నం పట్టాలు దాటుతుండగా సుమారు 50 ఏళ్ల వ్యక్తిని రైలు ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి ఒంటిపై ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు వేసుకునే యూనిఫాం ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 0883 2442821, 99597 63463, 94414 75999 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొత్తపల్లి: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన మేరుగు నూకరాజు (31) అదే గ్రామంలోని పెనుమల్ల నాగేశ్వరరావు రెడ్డికి చెందిన రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభంపై మరమ్మత్తు కోసం ఎక్కాడు. ఆ సమయంలో రొయ్యల చెరువు వద్ద జనరేటర్ పనిచేస్తుండంతో సప్లయ్ రివర్సు రావడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. నూకరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చలమలశెట్టి సునీల్‌కు పితృవియోగం


