ముంచేసిన మోంథా | - | Sakshi
Sakshi News home page

ముంచేసిన మోంథా

Oct 30 2025 9:10 AM | Updated on Oct 30 2025 9:10 AM

ముంచే

ముంచేసిన మోంథా

తుపాను పాడు చేసింది

ఎకరాకు సుమారు రూ.30వేల చొప్పున పెట్టబడి పెట్టాను. 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. తీరా చూస్తే పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను నా పంటను పాడు చేసింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.

– కర్రి గోపాల్‌రెడ్డి,

రామవరం గ్రామం, అనపర్తి మండలం

ప్రభుత్వం న్యాయం చేయాలి

కౌలుకు 12 ఎకరాల భూమి తీసుకుని సాగు చేస్తున్నాను. ఎకరానికి రూ.32 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట నేలకొరిగి పూర్తిగా నష్టం వచ్చింది. ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలి.

– జంగా వెంకటరెడ్డి కౌలు రైతు,

ఊలపల్లి గ్రామం, బిక్కవోలు మండలం

పెరవలి మండలం ఖండవల్లిలో నేలవాలిన దొండ పందిరి

దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో వర్షాలకు కూలిన ఇల్లు

కోరుకొండ మండలం మునగాలలో నీటిలో వరి పంట

సాక్షి, రాజమహేంద్రవరం: మోంథా తుపాను కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా వీచిన భారీ ఈదురు గాలులకు ప్రజలు, రైతులు అతలాకుతలం అయ్యారు. తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా చిగురుటాకులా మారింది. వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంటకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వర్షపు నీరు రహదారులపై ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ ఈదురుగాలులు వీయడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఉదయం కాసేపు చిరు జల్లులు కురిశాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఊపిరి పీల్చుకున్న ప్రజలు

నాలుగు రోజులు ఆందోళనకు గురిచేసిన మోంథా తుపాను మంగళవారం రాత్రి కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పెనుముప్పు తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

16,092 హెక్టార్లలో నేలకొరిగిన వరి

మోంథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వరి, మినుము, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం 18 మండలాల్లో వరి పంట, 5 మండలాల్లో మినుము పంట సాగు విస్తీర్ణం ఉంది. 70,046 హెక్టార్లలో వరి నాట్లు ఉండగా.. తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు 209 గ్రామాల పరిధిలోని 20,843 మంది రైతులకు చెందిన 16,092 హెక్టార్ల వరి నేలకొరిగింది. 896.3 హెక్టార్లలో పంట దెబ్బతింది.

1216 హెక్టార్లలో మినుము

జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల పరిధిలో 35 గ్రామాల్లో మినుము పంట తుపాను ప్రభావానికి గురైంది. 1,658 మంది రైతులకు చెందిన 2,160.50 హెక్టార్లలో మినుము ఉండగా.. 80 హెక్టార్లలో నేలకొరిగింది. 1,216 హెక్టార్లలో పంట దెబ్బతింది. రంగంపేట, గోపాలపురం, తాళ్లపూడి, కొవ్వూరు, నిడదవోలులో పంట నష్టం జరిగింది.

● జిల్లాలో ముగ్గురు రైతులకు చెందిన 3.22 హెక్టార్లలో పొగాకు సాగులో ఉండగా.. 3.22 హెక్టార్లు నీటిలో మునిగింది.

ఛిద్రమైన రహదారులు

తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రధాన, అంతర్గత, గ్రామీణ ప్రాంత రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 85.468 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. పెరవలి మండలంలో అత్యధికంగా ఛిద్రమయ్యాయి. ఈదురుగాలుల ప్రభావానికి 74 వృక్షాలు వివిధ ప్రాంతాల్లో పడిపోయాయి.

16 ఇళ్లు నేలమట్టం

తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులు, వర్షానికి జిల్లా వ్యాప్తంగా 16 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. బిక్కవోలులో 5, తాళ్లపూడిలో 1, సీతానగరం 1 రాజమండ్రిలో 1 ఇల్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు.

● కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలో వరి 1,484 ఎకరాలు, మినుము 172 ఎకరాలు, అరటి 138 ఎకరాలు, బొప్పాయి 8 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. కొవ్వూరులో 900 ఎకరాలు వరి, అరటి 291, బొప్పాయి 15 ఎకరాలు, మినుము 20 ఎకరాలు పంట నష్టం వాటిల్లింది. 7 విద్యుత్‌ స్తంభాలు విరిగి పోయాయి. తాళ్లపూడి, కొవ్వూరులో పలుచోట్ల చెట్లు విరిగి పోయాయి.

● సీతానగరంలో వరి 1,300 ఎకరాలు, అరటి, బొప్పాయి, కూరగాయలు సుమారు 100 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.

● దేవరపల్లి మండలంలో 233 హెక్టార్లలో వరి, నల్లజెర్లలో 465 హెక్టార్లలో వరి నేలకొరిగింది.

● నిడదవోలు రూరల్‌ మండలంలో 2 వేల ఎకరాల్లో వరి నేలనంటింది.

● తాళ్లపూడి మండలం పెద్దెవం గ్రామంలో మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలుల ప్రభావంతో జొన్నకూటి వీర్రాజు (58) అనే వ్యక్తి మృతి చెందారు. చలికి తట్టుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

● నిడదవోలు నియోజకవర్గం వ్యాప్తంగా 10,755 ఎకరాల్లో వరి, 1,275 ఎకరాల్లో అరటి పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క పెరవలి మండలంలోనే 900 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి లంకల్లో పండిస్తున్న అరటి పంట మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి ప్రాంతాల్లో సుమారు 1,000 ఎకరాల్లో బీర, అనబ, చిక్కుడు, దొండ నీటిలో కలిసిపోయాయి.

1.4 మిల్లీ మీటర్ల వర్షపాతం

జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లా సగటు వర్షపాతం 1.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా గోకవరంలో 6.0 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా దేవరపల్లిలో 0.2 మిల్లీ మీటర్లుగా నమోదైంది. మిగిలిన మండలాల్లో చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కురిసింది.

వైఎస్సార్‌ సీపీ శ్రేణుల పర్యటన

వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు విస్తృతంగా పర్యటించాయి. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు జి. శ్రీనివాస్‌ నాయుడు, తలారి వెంకట్రావు రైతులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

జిల్లాలో నష్టం ఇలా..(హెక్టార్లలో)

పంట సాగు నేల దెబ్బ

కొరిగింది తింది

వరి 70,046.3 16,092.1 896.3

మినుము 2,160.50 80 1,216.27

పొగాకు 3.22 0 3.22

కర్షకులకు కన్నీరు మిగిల్చిన తుపాను

13,213 హెక్టార్లలో దెబ్బతిన్న వరి,

1,041 హెక్టార్లలో మినుము

నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

నష్టం అంచనాల్లో అధికారులు

జిల్లా సగటున 2.0 మిల్లీమీటర్ల

వర్షపాతం నమోదు

ముంచేసిన మోంథా1
1/5

ముంచేసిన మోంథా

ముంచేసిన మోంథా2
2/5

ముంచేసిన మోంథా

ముంచేసిన మోంథా3
3/5

ముంచేసిన మోంథా

ముంచేసిన మోంథా4
4/5

ముంచేసిన మోంథా

ముంచేసిన మోంథా5
5/5

ముంచేసిన మోంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement