భక్తిశ్రద్ధలతో గో తులాభారం
బిక్కవోలు: ఇల్లపల్లి గ్రామంలోని 108 స్తంభాల శివాలయం (సత్యరామ రసలింగేశ్వరస్వామి ఆలయం)లో బుధవారం గో తులాభారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తిక మాసంలో బియ్యంతో ఆవుకు తులాభారం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు, ఆలయ నిర్వాహకుడు ముప్పిడి బాలచంద్ర గంగాధర తిలక్ దంపతులు ఏకాదశ రుద్రాభిషేకం, అష్టలక్ష్మి కుంకుమార్చన, పూజలు చేశారు. రాజీవ్ జమిందార్ దంపతులు చేతుల మీదుగా ఆవుకు తులాభారం నిర్వహించగా, 320 కిలోల బరువు తూగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని తమ తోచిన విధంగా బియ్యం వేశారు. ఆ బియ్యాన్ని దేవస్థానం నిర్వహించే అన్నదాన కార్యక్రమాల్లో వినియోగిస్తారు.


