సైనిక పాఠశాలల స్వాగతం
● ఆరు, తొమ్మిదో తరగతుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
● నేటితో గడువు పూర్తి
● వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష
రాయవరం: సైన్యంలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దాన్ని సాధించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సైనిక్ పాఠశాలలు పిల్లలకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. దీనిలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరంలో సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ఏటా నోటిఫికేషన్‌ను సైనిక్ స్కూల్ సొసైటీ జారీ చేస్తుంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీటీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటా డిసెంబర్‌లో విడుదలయ్యే నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ రెండోవారంలోనే వచ్చింది.
విద్యార్థులకు అవకాశం
సైనిక్ పాఠశాలలో సీటు సాధిస్తే గుణాత్మకమైన విద్యతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలు ఉంటాయి. ఆరో తరగతిలో బాలురతో పాటు బాలికలు ప్రవేశం పొందవచ్చు. 9వ తరగతిలో ప్రవేశాలకు బాలురు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్ష, వైద్య పరీక్షల్లో విజయం సాధించాలి. ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకునే అవకాశముంది.
వయో పరిమితి
ఆరో తరగతిలో చేరే విద్యార్థులు 10 నుంచి 12 ఏళ్లు (01 ఏప్రిల్ 2014 నుంచి 31 మార్చి 2016), 9వ తరగతిలో చేరే విద్యార్థులు 13 నుంచి 15 ఏళ్లు (01 ఏప్రిల్ 2011 నుంచి 31 మార్చి 2013 మధ్య జన్మించాలి) ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివిన వారికి అవకాశం ఉంటుంది.
దరఖాస్తు విధానం
2026 జనవరి నెలలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఐఎస్‌ఎస్‌ఈఈ.ఎన్‌టీఏ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలు, ఫొటో, సంతకాలను అప్‌లోడ్ చేయాలి. జనరల్, డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.700, ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తవగానే రిజిస్టర్ చేసుకున్న సెల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల : 10.10.2025
దరఖాస్తుకు చివరి తేది: 30.10.2025
తప్పుల సవరణకు: నవంబరు 2 నుంచి 4 వరకు
అడ్మిట్ కార్డు (హాల్ టికెట్) జారీ:
2026 జనవరి మొదటి వారం
ప్రవేశ పరీక్ష: 2026 జనవరి రెండో వారం
సైనిక పాఠశాలల స్వాగతం


