రైతులను ఏ విధంగా ఆదుకుంటారు?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చెల్లుబోయిన వేణు
● కడియం ఆవలో నష్టపోయిన
పొలాల పరిశీలన
కడియం: కూటమి ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించని కారణంగా పంట నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. బాధిత రైతులను పరామర్శించేందుకు, మండల కేంద్రమైన కడియంలో ఆవ ప్రాంతంలో బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలసి పర్యటించారు. వేణు మాట్లాడుతూ కడియం ఆవలో 1,800 ఎకరాల్లో పంట నేలనంటిందన్నారు. మెషీన్‌లతో కోత కూడా సాధ్యం కాదన్నారు. కూలీలను పెట్టి కోయిస్తే అయ్యే ఖర్చులను రైతులు తట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఈ విధంగా నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో కూటమి ప్రభుత్వం ప్రకటించాలన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా పెట్టుబడి సాయం అందించడంతో ఉత్సాహంగా కౌలు రైతులు సాగు చేసేవారన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పెట్టుబడి సాయం ఏడాదికి 20వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో రైతులు నమ్మి వారిని గెలిపించారన్నారు. కానీ గెలిచి 17 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు ఒకే ఏడాది కేవలం రూ.5వేలు రైతులకు ఇచ్చి చంద్రబాబు మిన్నకుండిపోయారన్నారు. జగన్ హయాంలో ఆర్బీకేల ద్వారా వ్యవసాయ సహాయకులను నియమించి ప్రతి ఎకరంలోని పంట వివరాలను నమోదు చేసి, పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేందన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే తగిన కార్యాచరణను చేపడతామని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు, పార్టీ మండల అధ్యక్షుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు.
సాయం వెంటనే ప్రకటించాలి
నల్లజర్ల: మోంథా తుపానుకు దెబ్బతిన్న పంటలకు రైతులకు ప్రభుత్వం చేసే సాయం ఏమిటో వెంటనే ప్రకటించాలని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వేణు, మాజీ హోంమంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం నల్లజర్లలో తుపానుకు నేలకొరిగిన పంటలను వారు పరిశీలించారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ తుపాను, అకాల వర్షాల వల్ల వరి, వర్జీనియా పొగాకు రైతులు నష్టపోయారన్నారు. గతంలో జగనన్న సీఎంగా ఉండగా వర్జీనియాను కూడ ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది లేదని విపత్తుల సమయంలోనైనా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల కన్వీనర్ వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంక అప్పారావు, జిల్లా కార్యదర్శి ముప్పిడి వెంకటరత్నం, వైస్ ఎంపీపీ అచ్యుత శివాజీ పాల్గొన్నారు.


