మోంథా హడల్
పెరవలి మండలం ఉసులుమర్రులో
హడావుడిగా వరి కోతలు
● తుపాను హెచ్చరికలతో వణుకు
● కాకినాడ వద్ద తీరం
దాటనున్న తీవ్ర తుపాను!
● అదే జరిగితే జిల్లాపై తీవ్ర ప్రభావం
● రైతుల్లో ఆందోళన
● చేతికి అంది వస్తున్న పంట
నోటికి అందదేమోనని ఆవేదన
పెరవలి: నేల దున్ని.. మడి సిద్ధం చేసి.. తడులు పెట్టి.. ఇలా నారు వేశారో లేదో.. అలా కురిసిన కుండపోత వానలకు వేసిన నారు కాస్తా సర్వనాశనమైంది. నానా అగచాట్లూ పడి.. మళ్లీ కొందరు నారు వేశారు. మరి కొందరు వెదజల్లు సాగు చేశారు.. మొత్తం మీద ఎలాగోలా సాగుకు శ్రీకారం చుట్టారు. పంట కాస్త ఏపుగా పెరిగి.. ఈనిక దశకు చేరుతున్న తరుణంలో.. మేఘాలు బద్దలైనట్లు ఇటీవల రోజుల తరబడి భారీ వర్షాలు..
పంట చివరి దశకు చేరుకుని, కొద్ది రోజుల్లో చేతికందుతుందని ఆశ పడుతున్న తరుణంలో.. ఇప్పుడు మోంథా తుపాను హెచ్చరికలు.. దీంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పంట ఏపుగా పెరిగి, పసిడి గింజలు పండించిన ప్రస్తుత తరుణంలో ఈ తుపాను విరుచుకుపడితే ఎంతటి విపత్తు సృష్టిస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు అప్రమత్తం
మోంథా తుపాను తీవ్ర రూపం దాల్చి, కాకినాడ వద్ద తీరం దాటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం తుపాను ప్రభావంతో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది గ్రామాల్లో నిత్యం పర్యవేక్షించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ హడావుడి చూసి ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పంట దక్కుతుందా..
ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 74,793 హెక్టార్లలో వరి సాగు జరిగింది. ఇప్పటి వరకూ సుమారు 681 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట కో తకు సిద్ధంగా ఉంది. తుపాను అలజడి లేకపోతే ఇప్పటికే మరో 2 వేల హెక్టార్లలో కోతలు పూర్తయ్యేవని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తుపాను వస్తే ఈదురు గాలులు, భారీ వర్షాలకు పంటంతా గంగపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారంలో రోజుల తరబడి కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 37,028 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నేలనంటేసింది. ఇప్పటికీ చేలల్లో నీరు లాగక, పంట నానిపోతోంది. ఈ తరుణంలో తుపాను విరుచుకుపడితే చేతికి అందుతుందనుకుంటున్న పంట నోటికి అందకుండా పోతుందని రైతులు దిగులు చెందుతున్నారు. వాతావరణ శాఖ చెబుతున్న స్థాయిలో తుపాను తీవ్రత ఉంటే.. కాకినాడ వద్దనే తీరం దాటితే తమకు కనీసం గింజ కూడా దక్కదని అంటున్నారు.
ఉద్యాన రైతుల్లోనూ ఆందోళన
జిల్లాలో వరితో పాటు అరటి, ఆయిల్‌పామ్, కొబ్బరి, బొప్పాయి, జామ, కోకో, చెరకు, కంద, మామిడి, కొబ్బరి, జీడిమామిడి, మిర్చి, కూరగాయలు, పూలు తదితర ఉద్యాన, వాణిజ్య పంటలు కూడా 64,536 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తుపాను ప్రభావం జిల్లాపై పడితే ముఖ్యంగా కొబ్బరి, బొప్పాయి, కోకో, అరటి, కూరగాయల పంటలు సర్వనాశనమవుతాయని రైతులు కలత చెందుతున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు అన్ని పంటలూ ఇప్పటికే ముంపునకు గురయ్యాయి. ఈ పరిస్థితుల్లో తుపాను విరుచుకుపడితే తోటలు నేలమట్టమవుతాయని, పంట మొత్తం అందకుండా పోతుందని, నష్టం లెక్కలకు అందని విధంగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో 1986లో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా జిల్లాలోని ఏటిగట్లకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. అలాగే, 1996లో వచ్చిన తుపాను కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. రైతులు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నారు. ఇప్పుడు మోంథా తుపానుతో అటువంటి ప్రళయం మళ్లీ చవిచూడాల్సి వస్తుందేమోనని వారు హడలెత్తుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
రాజమహేంద్రవరం సిటీ: మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.తిలక్ కుమార్ ఆదేశించారు. తుపాను దృష్ట్యా రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. ఇవి 24 గంటలూ 3 షిఫ్టుల్లో పని చేస్తాయన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తితే దగ్గరలోని విద్యుత్ సెక్షన్ కార్యాలయాన్ని లేదా 1912 టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. దీంతో పాటు రాజమహేంద్రవరంలోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో 73822 99960, 0883–2463354, రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ కార్యాలయం 94906 10093, రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ 94931 78874, నిడదవోలు డివిజన్ 83329 73595 నంబర్లను సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తిలక్ కుమార్ తెలిపారు.
మోంథా హడల్
మోంథా హడల్
మోంథా హడల్


