బెల్టుపై జవాబు చెప్పమంటే కోపమెందుకు?
ఎమ్మెల్యే గోరంట్లకు వైఎస్సార్
సీపీ నేత వేణు సూటి ప్రశ్న
రాజమహేంద్రవరం రూరల్: నియోజకవర్గంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై నియంత్రణ గురించి చెప్పాలని కోరితే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కోపమెందుకని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. శాటిలైట్ సిటీ గ్రామంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి మద్యం షాపులోను బాటిల్‌పై రూ.10 ఎక్కువగా వసూలు చేస్తున్నారని, ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. బెల్టు షాపులను నియంత్రించాలని కోరితే తాను మద్యం వ్యాపారం మానేశానంటూ గోరంట్ల కోపంగా చెబుతున్నారన్నారు. బెల్టు షాపుల అమ్మకాలపై సాక్ష్యం అడిగారని, అందుకే బెల్టు షాపులో రూ.120 బాటిల్ రూ.150కి, రూ.190 బాటిల్ రూ.240కి విక్రయిస్తున్న విషయాన్ని ప్రజల సాక్షిగా చూపిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం వ్యవహారం గుట్టు రట్టవడంతో మద్యం, బెల్టు షాపుల్లో ఏ మందు విక్రయిస్తున్నారో తెలియక మద్యపాన ప్రియులు భయాందోళన చెందుతున్నారన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా బెల్టు షాపులు అరికట్టలేని బుచ్చయ్య అసమర్థ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మద్యం షాపులు సిండికేట్‌గా మారి ఎకై ్సజ్ పోలీసులకు, పోలీసులకు ఇంత వాటాలివ్వాలంటూ ఫోన్ రికార్డింగ్ వాయిస్‌లు ఇటీవల హల్‌చల్ చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. నియోజకవర్గంలో బెల్టు షాపులు ఎవరి అనుమతితో నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే గోరంట్లను వేణు డిమాండ్ చేశారు. బెల్టు షాపు చట్టవిరుద్ధం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లాలాచెరువు, బుర్రిలంకల్లో భారీగా ఉన్న ఇసుక గుట్టలను ఆ పార్టీల నేతలు అమ్మేసుకున్నారన్నారు. ప్రస్తుతం ఉచితం పేరుతో 25 టన్నుల లారీల్లో 40 టన్నుల ఇసుక అమ్ముకుంటూ దోచేస్తున్నారన్నారు. నగరంలో ఇసుక లారీలు తిరగకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వదిలేస్తోందని మండిపడ్డారు. డ్రెడ్జింగ్ పేరుతో ఇసుక దోపిడీ భారీగా జరుగుతోందని ఆరోపించారు. రేషన్ బియ్యం సైతం పక్కదారి పడుతున్నాయన్నారు. గోరంట్ల దత్తత గ్రామమైన శాటిలైట్ సిటీలో ఎక్కడ చూసిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయని చెప్పారు. పేదలు జీవించే ఈ గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టకపోవడం గోరంట్ల అసమర్థ పాలనకు నిదర్శనమని వేణు దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


