వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
● నవంబర్ 4న ప్రజా ఉద్యమం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం రూరల్: వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం కూటమి ప్రభుత్వం చేస్తున్న చరిత్రాత్మక తప్పిదమని, దుర్మార్గమైన చర్యని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండుతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 4న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన ప్రజా ఉద్యమం చేపడుతున్నామన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శాటిలైట్ సిటీ గ్రామంలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 28న జరగాల్సిన ఈ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని మోంథా తుపాను నేపథ్యంలో నవంబర్ 4వ తేదీకి మార్చామని తెలిపారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రను తిరగరాసి, రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వీటిని పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరించడం ద్వారా కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకూ వైఎస్సార్ సీపీ ఆందోళన కొనసాగిస్తుందని వేణు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


