
శ్రీనివాసా..చిద్విలాసా
కొత్తపేట: ఏడు కొండలవాడా.. శ్రీవేంకటేశా.. చిద్విలాసా అంటూ ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తజనం కొలిచింది. కోనసీమ తిరుమల వాడపల్లి తిరు వీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలతో ఆలయం నూతన తేజస్సుతో వెలుగొందింది. అశేష భక్తజనం గోవింద నామస్మరణతో మార్మోగింది. వాడపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు, శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అశేష భక్తజనం తరలివచ్చింది. కలియుగ దైవాన్ని దర్శించుకున్న ప్రతి మదీ పరవశించిపోయింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా సాగాయి. హంస వాహనంపై ఊరేగిన శ్రీవారిని వీక్షించిన భక్తులు పులకించిపోయారు. మహిమాన్విత మనోహరమూర్తిని కాంచిన కనులదే భాగ్యమంటూ ఆనంద డోలికల్లో తేలియాడారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ విశేష పూజలు, హోమాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ చక్రధరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచి సంకల్పం, పుణ్యాహ వచనం, సప్త కలశారాధన, అభిషేకం, ప్రధాన హోమాలు, దిగ్ధేవతా బలిహరణ, అనంతరం మహా పుష్పయాగం, నీరాజన మంత్రపుష్పం, సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, సహస్ర దీపాలంకరణ సేవ, విశేషార్చన తదితర పూజలు జరిపారు. కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.
హంస వాహనం.. మనోహరం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సరస్వతి అలంకరణలో స్వామివారికి హంస వాహన సేవ మనోహరంగా సాగింది. వాహనంపై శ్రీవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవ ఆధ్యంతం భక్తుల గోవింద నామస్మరణ నడుమ వేద పండితులు వ్యాఖ్యోపన్యాసంతో కన్నుల వైకుంఠంగా సాగింది. సరస్వతీదేవి జ్ఞానం, విద్య, కళలకు అధిష్టాన దేవత కాబట్టి ఈ అలంకారంలో జ్ఞాన ప్రదాతగా శ్రీవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు జ్ఞానం, చదువులో విజయం, కళలలో నైపుణ్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాత్రి వరకూ వేచి ఉండి సరస్వతీదేవి అలంకారంలో ఉన్న శ్రీవారిని వీక్షించి తన్మయత్వం చెందారు.
అలరించిన స్వరార్చన
ఉత్సవాల్లో భాగంగా ఆలయ వసంత మండపంలో దేవస్థానం సంకీర్తనాచారి కరుటూరి వెంకట శ్రీనివాసరావు అన్నమయ్య స్వరార్చనలు అలరించాయి. పలు సంకీర్తనలు ఆలపించగా, వేలాది మంది భక్తులు పరవశితులయ్యారు.
ఒక్కరోజే రూ. 54.66 లక్షల ఆదాయం
బ్రహ్మోత్సవాలు, శనివారం సందర్భంగా రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూ ప్రసాద విక్రయం, ఆన్‌లైన్ తదితర సేవల ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.54,66,022 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు.
ఫ కమనీయంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఫ కోలాహలంగా వాడపల్లి వెంకన్న క్షేత్రం
ఫ ఉత్సవాలకు భారీగా
తరలివచ్చిన భక్తజనం

శ్రీనివాసా..చిద్విలాసా

శ్రీనివాసా..చిద్విలాసా

శ్రీనివాసా..చిద్విలాసా