
వరిదొడుకులు తప్పేనా?
పెరవలి: ఖరీఫ్‌లో ధాన్యాన్ని సేకరించటానికి అధికారులు సిద్ధమవుతుండగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సాగులో అధికారులు వేసిన అంచనాలు తప్పటంతో ధాన్యం కొనుగోలు కూడా ఇలాగే ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రబీ సీజన్‌లో పడినపాట్లు మరువక ముందే నేడు ఖరీఫ్ సాగు పంట అందుబాటులోకి రానుండటంతో అధికారులు ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తారా అని చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఽవరిసాగు 76,941 హెక్టార్లలో చేపడతారని అంచనాలు వేసినా 55,021 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. ఈ నెల 11న జరిగిన జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో 5,31,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఎంతమేర కొనుగోలు చేస్తారనేది అధికారులు చెప్పలేదు. దీంతో రైతులు గందరగోళంలో పడ్డారు. గత ఏడాది రబీ సీజన్‌లో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయటంతో రైతులు నానా పాట్లూ పడ్డారు.
సాగు తగ్గడానికి కారణాలు
ఖరీఫ్‌లో వరి సాగు తగ్గింది. జిల్లాలో 21,920 హెక్టార్లలో అసలు నాట్లే పడలేదు. రైతులు వరి సాగు చేపట్టకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో సేకరించక దళారీలకు అమ్ముకోవలసి వస్తోంది. మెట్టలో ముందస్తుగా ఽవరి కోతలు పూర్తి అవుతుండగా డెల్టా ప్రాంతంలో చేలు నవంబర్‌లో కానీ కోతలకు రావటం లేదు. దీంతో ముందుగా కోతలు కోసిన చేల నుంచి ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేసి టార్గెట్ పూర్తి అయ్యిందని చెప్పటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత రబీ సీజన్‌లో ఇలాగే జరగటంతో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అధికారులు, మిల్లర్లు చుట్టూ ప్రదక్షిణలు చేసి ధాన్యం అమ్ముకోలేక ఽఅయిన కాడికి దళారీలకు విక్రయించుకున్నారు. ఈ సార్వా సీజన్‌లో యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. అధికారులు మాత్రం జిల్లాకు సరిపడా యూరియా వచ్చిందని, గతంలో కంటే ఎక్కువ యూరియా సరఫరా చేశామని చెబుతున్నారు. కష్టపడి పండించిన పంట అమ్ముకొనే వీలు లేనప్పుడు అసలు పంటే వేయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నామని, అందుకే సాగు చేపట్టలేదని రైతులు చెబుతున్నారు.
లక్ష్యాన్ని చేరుతుందా..
ఖరీఫ్ సాగులోనైనా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రబీలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఈసారైనా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలి. పంట దిగుబడి అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా కొనుగోలు కూడా చేపడితేనే రైతుల కష్టాలు గట్టెక్కుతాయి.
ఇబ్బంది లేకుండా చూడాలి
రబీ సీజన్‌లో ధాన్యం అమ్మిన సొమ్ము ఆలస్యంగా రావడంతో నానా పాట్లూ పడ్డాం. ఈ ఏడాదైనా సక్రమంగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.
–చిట్టీడి వెంకట సత్యనారాయణ,
రైతు, పెరవలి
డెల్టాను దృష్టిలో ఉంచుకోవాలి
ఈ ఖరీఫ్‌లో నాట్లు వేసే దశ నుంచీ ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే రెండు సార్లు వర్షాలకు నారు పోయింది. డెల్టాలో వరి కోతలు నవంబర్ నెలలో ప్రారంభం అవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అఽధికారులు ధాన్యం కొనుగోలు చేయాలి.
– అధికారి పల్లపురాజు, రైతు, కానూరు అగ్రహారం
జిల్లాలో ఇలా..
మండలం వరి సాగు
(హెక్టార్లలో)
రాజమహేంద్రవరం రూరల్ 1,191
కడియం 2,100
రాజానగరం 2,791
అనపర్తి 3,310
బిక్కవోలు 5,265
కోరుకొండ 1,052
గోకవరం 1,114
సీతానగరం 4,632
రంగంౖపేట 1,160
చాగల్లు 3,110
దేవరపల్లి 2,818
గోపాలపురం 1,400
కొవ్వూరు 4,316
నిడదవోలు 6,600
పెరవలి 2,325
తాళ్ళపూడి 2,395
ఉండ్రాజవరం 4,792
నల్లజర్ల 4,650
ఖరీఫ్ ధాన్యం సక్రమంగా
కొనుగోలు చేస్తారా?
జిల్లాలో 55,021 హెక్టార్లలో సాగు
5,31,616 లక్షల
మెట్రిక్ టన్నులు దిగుబడి అంచనా
రబీలో 5.20 లక్షల
మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
కొనుగోలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే
ఇప్పుడు అలాగే ఉంటుందా అని
రైతులకు అనుమానాలు
ఊహించని విధంగా
తగ్గిన వరి సాగు విస్తీర్ణం