
బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయండి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం జిల్లా నాయకులు దొమ్మేటి శంకరరావు, సత్యనారాయణ, బిల్డర్ చిన్నల ఆధ్వర్యంలో బీసీల శ్రీఐద్ఙు ప్రధాన డిమాండ్లపై శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి అనంతరం ఆర్డీఓ కృష్ణనాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న బీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా శ్రీప్రత్యేక రక్షణ చట్టం్ఙ తెస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలలో 33 శాతం, స్థానిక సంస్థల నామినేటెడ్ పదవులు, నామినేషన్ లలో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతామన్న మరో వాగ్దానం ఇప్పటి దాకా అమలు కాలేదన్నారు. స్థానిక ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేయకుండా, బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఏప్రిల్ తరువాత ఆరు నెలల లోపు కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలు జరిపే వీలున్నందున, ఈ లోపే రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరిపి, ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేసి, బీసీలకు వారి జనాభా దామాషా మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. కార్యక్రమంలో నరవ గోపాలకృష్ణ మార్గాని సురేష్, బీసీ నాయకులు పాల్గొన్నారు.