
మీకు నచ్చని వార్తలు వస్తే కేసులు పెడతారా?
పత్రికల్లో మీకు నచ్చని వార్తలు, విమర్శలు వస్తే కేసులు పెడతారా? ఇదేం పద్ధతి? ఇంత దారుణంగా పత్రికా స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ మీద కూటమి ప్రభుత్వం దాడులు చేయడం దుర్మార్గం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ అసమర్థత, ఇతర వైఫల్యాలను ప్రజల పక్షాన, ప్రజాగొంతుగా వినిపిస్తుంటే తట్టుకోలేక దాడులకు దిగుతున్నట్లుగా స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వం చర్యలను యావత్ ప్రజానీకం గమనిస్తోంది. – మార్గాని భరత్‌రామ్, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం
ప్రజాస్వామ్యానికి విరుద్ధం ˘
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే పత్రికల మీద దాడులు చేసి కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది ప్రతికా స్వేచ్ఛను అడ్డుకోవటమే. జర్నలిస్టులు వెతికి తీసిన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలే తప్ప వారిపై కేసులు పెట్టడం అమానుషం. ప్రభుత్వం వెంటనే సాక్షి ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.
– పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు