
గణపతికి 108 ప్రసాదాల నివేదన
తాళ్లపూడి: వినాయక చవితి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా కొలువుదీరిన గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రక్కిలంక గ్రామంలోని కాపుల వీధిలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 108 రకాల ప్రసాదాలతో నివేదన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు.
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేల మంది భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దాతల ఆర్థిక సాయంతో 7,500 మందికి అన్నసమారాధన చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో అన్నసమారాధన నిర్వహిస్తున్నామని, అలాగే ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
న్యాయ సేవలు మరింత సులభతరం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పౌరులు న్యాయ సేవలను మరింత సులభంగా పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఈ– సేవ కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను సులభంగా పొందగలరని, న్యాయవాదులు తమ వృత్తిలో సమర్థతను పెంపొందించుకోవచ్చన్నారు. దీని ద్వారా న్యాయవాదులు, కక్షిదారులు, పౌరులు తమ కేసుల స్థితి, తీర్పులు, ఆదేశాల కాపీలు, ఈ–ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.మాధురి, ఎస్.ఉమా సునంద, ఎస్‌కే జానీబాషా, కె.ప్రకాష్‌బాబు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బోధనాసుపత్రికి ముగ్గురు
ప్రొఫెసర్ల నియామకం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం బోధనాసుపత్రికి ముగ్గురు ప్రొఫెసర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. ఆసుపత్రిలో ఆర్థో విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎస్.చంద్రశేఖర్‌ను ప్రొఫెసర్‌గా, అలాగే వైజాగ్‌కు చెందిన సైక్రియాటిస్ట్ ఎం.విజయలక్ష్మి, చర్మవ్యాధుల ప్రొఫెసర్‌గా ధన్యశ్రీ నియమితులయ్యారు.
శృంగార వల్లభుని ఆదాయం
రూ.2.36 లక్షలు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అర్చకుడు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సేవల ద్వారా స్వామికి రూ.2,36,023 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు.

గణపతికి 108 ప్రసాదాల నివేదన

గణపతికి 108 ప్రసాదాల నివేదన