
పిఠాపురంలో లారీ చోరీ
పిఠాపురం: ఆయిల్ లోడు లారీ మాయమైన సంఘటన పిఠాపురంలో మంగళవారం రాత్రి కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆ లారీ తుని సమీపంలో దొరికినప్పటికీ లారీలో ఉండాల్సిన సుమారు రూ.30 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు మాయమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, లారీ యజమాని కథనం ప్రకారం.. పిఠాపురం కుంతీమాధవస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న డి.అప్పారావు రాజులుకు చెందిన లారీ మంగళవారం ఉదయం కాకినాడలోని ఒక ఆయిల్ కంపెనీలో ఆయిల్ ప్యాకెట్‌ల లోడుకు వెళ్లింది. సాయంత్రానికి లోడు వేసుకుని అన్లోడ్‌కు బయలు దేరాల్సి ఉండగా, లారీ డ్రైవర్‌కు అత్యవసర పని ఉండడంతో లారీ యజమాని మరో తాత్కాలిక డ్రైవర్‌ను మాట్లాడుతున్నారు. ఆ తాత్కాలిక డ్రైవర్ తాను బుధవారం తెల్లవారుజామున బయలు దేరుతానని చెప్పడంతో లారీని తెచ్చి పిఠాపురంలో కుంతీమాధవస్వామి ఆలయం వద్ద ఉన్న లారీ యజమాని ఇంటి దగ్గరలో సీసీ కెమెరాలు ఉన్నచోట పార్కింగ్ చేశారు. తెల్లవారు జామున తాత్కాలిక డ్రైవర్ వచ్చి తీసుకునే విధంగా లారీ తాళాలను లారీలోనే పెట్టి ఆ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పి యజమాని తన ఇంట్లో నిద్రించాడు. బుధవారం తెల్లవారు జామున తాత్కాలిక డ్రైవర్ వచ్చి చూడగా, లారీ కనిపించకపోవడంతో యజమానితో పాటు చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా లారీ గొల్లప్రోలు వైపునకు వెళ్లినట్టు గుర్తించారు. గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా, మాయమైన లారీ టోల్‌గేట్ వద్ద ఆగి టోల్ ఫీజు చెల్లించి వెళ్లినట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఇచ్చిన సమాచారంతో లోడుతో ఉన్న లారీని శంఖవరం దగ్గర మరో వ్యక్తికి అప్పగించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బృందాలుగా లారీ కోసం తుని, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో వెతకగా తుని సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన లారీ నిలిపి ఉండడం గమనించారు. అయితే లారీలో ఉండాల్సిన ఆయిల్ ప్యాకెట్టు మాత్రం ఖాళీ అవడాన్ని పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న ఆయిల్ లోడును మరో లారీలోకి ఎక్కించుకుని ఈ లారీని వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. బాధిత లారీ యజమాని ఫిర్యాదు మేరకు పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై మణికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
రూ.30 లక్షల విలువైన
ఆయిల్ ప్యాకెట్లు మాయం
తుని వద్ద లారీని
వదిలి వెళ్లిన అగంతకులు