
ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ వేధింపులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్ పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్రపురం గ్రామానికి చెందిన డేగల గంగాధర్, డేగల వరలక్ష్మిల కుమార్తె ప్రగడ వర్ధినిలక్ష్మికి గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామానికి చెందిన ప్రగడ నాగేంద్రబాబు, ప్రగడ మంగాదేవిల కుమారుడు ప్రగడ నాగ దుర్గారావుకు 2022లో వివాహం చేశారన్నారు. వివాహ సమయంలో కట్నంగా రెండెకరాల పొలం, రూ.30 లక్షలు, 30 కాసుల బంగారం, రూ.5 లక్షల ఆడపడుచు కట్నంగా ఇచ్చినట్లు వివరించారు. 18 నెలలు కాపురం సక్రమంగా జరిగిందని, తర్వాత ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ భార్య ప్రగడ వర్ధినిలక్ష్మిని భర్త నాగ దుర్గారావుతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేస్తూ ఇంటి నుంచి బయటకు గెంటేశారని వివరించారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. అయితే తన కుమార్తెకు తండ్రిని చూపించాలనే ఉద్దేశంతో ప్రగడ నాగ దుర్గాప్రసాద్ ఇంటికి కుమార్తెతో వెళ్లగా భర్త అత్తమామలు మరి కొంతమంది కలసి వర్ధిని లక్ష్మిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి నాగ దుర్గాప్రసాద్ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. పెళ్లయినప్పటి నుంచి ఏ పనీ లేకుండా ఇంట్లోనే ఉంటూ బెట్టింగ్ గేమ్‌లు ఆడుతూ నష్టపోయి తనకు మరింత అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేసేవాడని ఆరోపించారు. బాధిత మహిళ వర్ధిని లక్ష్మికి న్యాయం చేసి ఆమె కాపురం నిలబెట్టాలని ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. పసిపాపతో ఉన్న తన కుమార్తెకు న్యాయం చేయాలని వర్ధిని లక్ష్మి తల్లిదండ్రులు వేడుకున్నారు. న్యాయం జరగకపోతే హూమన్ రైట్స్, మహిళా సంఘాలతో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు.
బాధితురాలికి న్యాయం చేయండి
హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ రాష్ట్రాల చైర్‌పర్సన్ లక్ష్మి డిమాండ్