
‘రాష్ట్రీయ బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
రాయవరం: కేంద్ర ప్రభుత్వం ఏటా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ పేరుతో అసాధారణ ప్రతిభ కనబర్చిన బాల బాలికలకు అవార్డులను అందజేస్తోంది. బాలల్లో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను ఇస్తోంది. ఈ మేరకు విభిన్న రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సామాజిక సేవ, అత్యంత ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు, సంస్కృతి, శాస్త్ర సాంకేతిక విద్య, పర్యావరణ పరిరక్షణ, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు తదితర రంగాల్లో రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ విజయాలు సాధించి ఉండాలి. భారత సంతతికి చెంది, దేశంలో నివసిస్తున్న బాలలు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవాలిలా..
అవార్డ్. జీవీవీ. ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ప్రతినిధులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తారు. అర్హత పొందిన దరఖాస్తుదారుల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన బాలలను ఎంపిక చేసి తుది జాబితాను కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటిస్తారు. ఈ ఏడాది జూలై 31వ తేదికి అభ్యర్థుల వయసు ఐదు నుంచి 18 ఏళ్లు ఉండాలి. అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రయోజనాలు ఇలా..
ఎంపికై న వారికి 2026 జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జ్ఞాపిక, ధ్రువపత్రం, ప్రశంసాపత్రం అందజేస్తారు. రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు ఎంపికై న వారిని ప్రధానమంత్రి అభినందిస్తారు. గణతంత్ర దినోత్సవ ర్యాలీలో భాగస్వాములను చేస్తారు. భవిష్యత్తులో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో అవార్డు పొందిన వారికి ప్రాధాన్యమిస్తారు.
ఈ నెల 15 తుది గడువు
అసాధారణ ప్రతిభ కనబర్చిన
చిన్నారులకు అవకాశం