
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 8, 10 తేదీల్లో రెండు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. చర్లపల్లి – కాకినాడ టౌన్ (07031) ఈ నెల 8వ తేదీ శుక్రవారం బయలు దేరుతుందన్నారు. కాకినాడ టౌన్ – చర్లపల్లి (07032) ఈ నెల 10వ తేదీ ఆదివారం బయలు దేరుతుందని తెలిపారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక ఆటోనగర్ సమీపంలో అనధికారికంగా తరలిస్తున్న 15,190 కిలోల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు లారీలో రవాణా చేస్తున్న వీటి విలువ రూ. 6,98,740గా ఎంఎస్‌ఓ బాపిరాజు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన లారీ డ్రైవర్ తంగిరాల ఏడుకొండలును అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నామని రాజానగరం పోలీసులు తెలిపారు. అతని వద్ద లభించిన ఫోన్ ఆధారంగా ఈ రవాణాకు సూత్రధారి మొహ్మద్ ఆలియాగా తెలుస్తుందన్నారు. 6ఏ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.