యాప్‌లతో యాతన.. | - | Sakshi
Sakshi News home page

యాప్‌లతో యాతన..

Jul 25 2025 5:01 AM | Updated on Jul 25 2025 5:01 AM

యాప్‌

యాప్‌లతో యాతన..

పనిభారం.. నరకం

సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకే అందించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థలను తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వలంటీర్లను విధులకు దూరం పెట్టి, వారి పనిభారాన్ని సచివాలయ ఉద్యోగులపై మోపింది. బ్యాంకు సిబ్బంది చేయాల్సిన ఖాతాకు ఆధార్‌ లింక్‌, ఈకేవైసీ వంటి పనులను, ఐటీ శాఖ చేయాల్సిన వర్క్‌ ఫ్రం హోం సిటిజన్స్‌ గుర్తింపు సర్వేను, పరిశ్రమల శాఖ నిర్వహించాల్సిన ఎంఎస్‌ఎంఈ సంస్థల గుర్తింపు సర్వేలను, సహకార సంఘాల రికార్డుల కంప్యూటీకరణలో భాగంగా సహకార సంఘాల సిబ్బంది రైతులకు ఈకేవైసీ చేయాల్సిన పనులను సైతం సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది.

కపిలేశ్వరపురం: ఉన్నది ఊడపీకేలా.. పథకాలన్నీ అటకెక్కించేలా.. ఉద్యోగులను హింసించేలా.. పలు యాప్‌లతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం యాప్‌ల నిర్వహణ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకో, ఇస్తున్న లబ్ధిని ఎగ్గొట్టేందుకో అన్నట్టు ఉంది. అంతేకాకుండా యాప్‌ల నిర్వహణతో ప్రభుత్వ, స్కీమ్‌ ఉద్యోగులు, సిబ్బందికి నరకం కనిపిస్తోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మొబైల్‌ యాప్‌ తెరిచి ఎవరింటికి వెళ్లినా ప్రభుత్వం తమకేమి మేలు చేస్తుందమ్మా అని అడగడంతో ఉద్యోగులు సంతోష పడేవారు. ఇప్పుడు యాప్‌ తెరిచి ఇంటికెళ్తే సదరు ఉద్యోగి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి నెలకొంటుంది. తమపై యాప్‌ల భారాన్ని తొలగించాలంటూ అంగన్‌వాడీ తదితర చిరు ఉద్యోగులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళనలను సైతం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో 18,32,332, కాకినాడ జిల్లాలో 20,92,374, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 17,19,013 మంది జనాభా ఉన్నారు. కాగా వారిలో అత్యధికులు కూటమి ప్రభుత్వం యాప్‌ల నిర్వహణలో బాధితులే. ఏదో రూపంలో వారి నుంచి సర్వేల ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరిస్తుండటంతో ఎప్పుడు ఏ లబ్ధి ఎగిరిపోతుందోనంటూ ఆందోళనలో ఉన్నారు. ఇక స్కీమ్‌ ఉద్యోగులు పనిభారంతో అల్లాడుతున్నారు. కాకినాడ జిల్లాలోని 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,986 మెయిన్‌, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు 1,05,996 మంది ప్రీస్కూల్‌ పిల్లలు, 11,610 మంది బాలింతలు, 10,573 మంది గర్భిణులకు సేవలందిస్తున్న అంగన్‌వాడీలు పలుమార్లు యాప్‌లను రద్దు చేయాలని ధర్నా చేశారు. కోనసీమ జిల్లాలోని 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,726 మెయిన్‌, మినీ అంగన్‌వాడీ కేంద్రాలుండగా 86,296 మంది చిన్నారులు, 15,743 మంది గర్భిణులు, బాలింతలు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలో 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,536 మెయిన్‌, 26 మినీ మొత్తం 1,562 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వేల సంఖ్యలో అంగన్‌వాడీలు యాప్‌లతో యాతన పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 135 పీహెచ్‌సీలు, 22 సీహెచ్‌సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడలో జీజీహెచ్‌, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, గ్రామీణ, అర్బన్‌ సీహెచ్‌సీల్లో 1,445 మంది హెల్త్‌ సెక్రటరీలు ఉన్నారు. 200 మంది ఏఎన్‌ఎంలు, 473 మంది స్టాఫ్‌ నర్సులు, 1232 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1,396 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఆయా సంస్థల్లో ఆరోగ్యపరమైన యాప్‌ల నిర్వహణతో సిబ్బంది పనిభారాన్ని మోస్తున్నారు.

ఆన్‌లైన్‌.. పరేషాన్‌

సామాన్య ప్రజలకు సేవలందించేందుకు అంగన్‌వాడీ, ఆశ, తదితర చిరు ఉద్యోగులు ఎప్పుడూ ముందుంటారన్నది కరోనా లాంటి విపత్కర కాలంలోనే నిరూపితమైంది. వారిని గౌరవంగా చూసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం యాప్‌ల పేరుతో వేధిస్తుండటంతో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణకు 2.0 వెర్షన్‌ బాల సంజీవని యాప్‌లో కొత్త వర్షన్‌ను సవరించి ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కంపల్సరీ వర్కర్‌, హెల్పర్‌ ఫొటో తీసి, సబ్మిట్‌ చేసి, ప్రీ స్కూల్‌ పిల్లల ఫొటోలను కూడా ఇన్‌టైమ్‌లో తీసి సబ్మిట్‌ చేయాలంటున్నారు. వారికి సంబంధించిన మెనూ కూడా ఇన్‌టైమ్‌లో ఆన్‌లైన్‌ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం సరకులను ఎప్పుడు పంపిస్తుందో తెలియని పరిస్థితుల్లో పీకపై కత్తిపెట్టినట్టు వెంటనే యాప్‌లో వివరాలను నమోదు చేయాలని చెప్పడాన్ని ఆయా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఎగ్గొట్టేందుకు పావులు కదుపుతూ..

పెన్షన్స్‌ ఎగవేతకు పెన్షన్స్‌ పేమెంట్‌ యాప్‌ను పావుగా ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అర్హులకే ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను అందించేందుకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నట్టు పైకి చెబుతుంది. ఈ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను జియో ట్యాగింగ్‌ చేయడం ద్వారా 300 మీటర్ల దూరం దాటి సొమ్ము తీసుకుంటున్న వారిని గుర్తించి మరికొన్ని ఆప్షన్స్‌ను పూర్తి చేసేలా చేస్తుంది. తర్వాత వారిని విచారించి పింఛన్‌కు అర్హులా కాదా అనే దానిపై దృష్టి సారిస్తుందన్న వాదన ఉంది.

సాంకేతిక దన్ను లేకుండా..

ఐసీడీఎస్‌ పరిధిలోని యాప్‌ల పట్ల లబ్ధిదారుల్లో సైతం వ్యతిరేకత వస్తుంది. యాప్‌లను రద్దు చేయాలంటూ తాము చేసిన ఆందోళనల్లో లబ్ధిదారులు సైతం పాల్గొన్నారు. సరైన సాంకేతిక దన్ను సమకూర్చుకుండా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, లబ్ధిదారులకు ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం నిర్వహణ సాధ్యం కాదు. సమస్యలపై రాష్ట్రపతికి లేఖ కూడా రాశాం.

– కె.కృష్ణవేణి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌

యూనియన్‌, మండపేట

ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)తో యాతన

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు గుడ్లు, పాలతో పాటు మరికొన్ని పౌష్టికాహార పదార్థాలను అందజేస్తున్నారు. ఆయా వివరాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని బాల సంజీవిని యాప్‌లో, కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని పోషణ ట్రాకర్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టిం యాప్‌ ద్వారా నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. లబ్ధిదారుల మొబైల్‌ నుంచి వచ్చే ఓటీపీతో వివరాలు ఖరారు చేయాలి. ఆ ప్రక్రియను సాగించేందుకు తగిన సాంకేతిక పరికరాలను కానీ, సమయాన్ని కానీ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముందుగా ఫీడ్‌ చేసిన లబ్ధిదారుల ఫొటో ఎలా ఉండేదో వర్తమానంలో కూడా అచ్చుగుద్దినట్టు ఉంటేనే యాప్‌లో వివరాలు నమోదవుతున్నాయి. వివాహమైనప్పుడు యాప్‌లో ఫీడ్‌ చేసిన ఫొటోతో పిల్లలను కనివారిని పెంచుతున్న క్రమంలో ముఖంలో వచ్చిన మార్పులను యాప్‌ అంగీకరించకపోవడంతో యాతన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంగన్‌వాడీలకు ప్రభుత్వం తరఫున అప్‌డేటెడ్‌ సెల్‌ఫోన్లను ఇవ్వకపోవడంతో వారి సొంత ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకుని యాప్‌లను వాడాల్సి వస్తుంది. ప్రభుత్వం నామమాత్రంగా ఇస్తున్న 2 జీబీ డేటా సరిపోకపోవడం, నెట్‌ సిగ్నల్స్‌ 5జీ కాకపోవడం లబ్ధిదారులను, అంగన్‌వాడీలను ఇబ్బంది పెడుతుంది.

చిరుద్యోగులకు సంకటంలా నిర్వహణ

కూటమి పాలనలో సంక్షేమానికి తూట్లు

తిరకాసు పెట్టేందుకే ముందుకు..

యాప్‌లతో యాతన..1
1/1

యాప్‌లతో యాతన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement