
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ స్కాంలో అక్రమ అరెస్టుకు గురై, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ములాఖత్ అయ్యారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరిన ఆయన రాజమహేంద్రవరం నగరంలో తాను తీసుకున్న ఇంట్లో కాసేపు కూర్చుని నేతలతో సమాలోచనలు చేశారు. అంతకు ముందు కొవ్వూరు టోల్‌గేట్ వద్దకు చేరుకోగానే.. అప్పటికే భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రీజనల్ కో–ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వరకు భారీ కాన్వాయ్‌గా వచ్చారు. మంత్రి కారుమూరి, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పెద్దాపురం ఇన్‌చార్జి దవులూరి దొరబాబు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహమ్మద్ ఆరిఫ్, మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులు సెంట్రల్ జైల్ వద్దకు చేరుకున్నారు. పెద్దిరెడ్డి, వనిత, భరత్ ములాఖత్ అయ్యే వరకు అక్కడే కూర్చున్నారు. అనంతరం పెద్దిరెడ్డికి వీడ్కోలు పలికారు.
పోలీసుల ఆంక్షలు
పోలీసులు జైలు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేశారు. మిథున్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, మాజీ మంత్రి కారుమూరి, నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జైల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని నానా హంగామా చేశారు. మిథున్‌రెడ్డికి ఆహారం, దిండు, దుప్పట్లను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు న్యాయవాది కలుగజేసుకుని తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది.
హైదరాబాద్‌కు పయనం
మధురపూడి: బుధవారం మధురపూడి విమానాశ్రయం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్ అనంతరం ఆయన ఇండిగో విమానంలో బయలుదేరారు.
టోల్‌గేట్ వద్దకు
భారీగా చేరుకున్న నేతలు
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో
ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం