
ఆటోలో తిప్పి.. తీవ్రంగా కొట్టి..
అమలాపురం టౌన్: ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షల వసూలు చేశారన్న వివాదంలో దళిత యువకుడితో పాటు, మున్సిపల్ మాజీ ఉద్యోగిని ఆరుగురు తీవ్రంగా హింసించిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బు వసూలు చేశారనే వివాదంలో అయినవిల్లి మండలం వెలవెలపల్లికి చెందిన అధ్యాపకుడు దోనిపాటి మహేష్, మున్సిపల్ మాజీ ఉద్యోగి సిరసపల్లి ఉదయశంకర్‌ను తమ డబ్బులు ఎప్పుడిస్తారంటూ ఆరుగురు నిందితులు ఆటోలో పలుచోట్ల తిప్పి, తీవ్రంగా కొట్టారు. అమలాపురం పట్టణం శ్రీరామపురానికి చెందిన యల్లమెల్లి విజయ్ రవిశంకర్, అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లికి చెందిన ఉరదల బాలరాజు, విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన యర్రా కృష్ణను ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
పెద్ద సార్ మాట్లాడుతున్నారని..
మున్సిపాలిటీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏడుగురు నిరుద్యోగుల నుంచి మున్సిపల్ మాజీ ఉద్యోగి సిరసపల్లి ఉదయశంకర్ రూ.లక్షల్లో వసూలు చేశాడు. అదిగో ఇదిగో ఉద్యోగమంటూ నిరుద్యోగులను మభ్య పెట్టాడు. వారిని నమ్మించేందుకు ఉదయ్‌శఽంకర్ ‘పెద్ద సార్ మాట్లాతున్నార’ని దోనిపాటి మహేష్‌తో ఫోన్ మాట్లాడించాడు. పలుమార్లు ఫోన్ కాన్పరెన్స్‌ను నిర్వహించి, నిరుద్యోగులతో పాటు, నిందితులతో మాట్లాడించేవాడు. అప్పటికే మహేష్‌కు ఉదయ్‌శంకర్ డబ్బు ఇవ్వాల్సి ఉండగా, ఇలా పెద్ద సార్‌గా మాట్లాడితే వచ్చిన డబ్బుతో బాకీ ఇచ్చేస్తానని మహేష్‌ను నమ్మించాడు. ఇందులో భాగంగా నిందితులు యల్లమెల్లి విజయ్ రవిశంకర్ తదితరులు మహేష్‌కు ఫోన్ చేసి తాము చెప్పిన చోటికి రాకపోతే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడి మహేష్.. అప్పటికే బందీగా ఉన్న ఉదయ్‌శంకర్‌ను డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న విజయ్ రవిశంకర్ బ్యాచ్ వద్దకు వచ్చారు. పేరూరు వై.జంక్షన్‌కు వచ్చిన మహేష్‌తో పాటు, ఉదయ్‌శంకర్‌ను బోడసకుర్రు గోదావరి గట్టు వద్దకు తీసుకెళ్లి, పగులగొట్టిన బీరు బాటిళ్లతో చంపేస్తామని బెదిరించారు. రబ్బరు ట్యూబ్, కర్ర, కొబ్బరి మట్టతో తీవ్రంగా కొట్టారు. అక్కడి నుంచి మరో రెండు చోట్లకు ఆటోలో తీసుకెళ్లి, ఇద్దరినీ చిత్రహింసలు పెట్టారు. అయితే ఉదయ్‌శంకర్ తప్పించుకోవడంతో, తీవ్ర గాయాలతో ఉన్న మహేష్‌ను వారు వదిలిపెట్టారు. కులం పేరుతో మహేష్‌ను నిందితులు దూషించారు. మహేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ బృందం బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల నుంచి ఆటో, దాడికి వాడిన రబ్బరు ట్యూబ్, కొబ్బరి మట్టను స్వాఽధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.
ఆరుగురిపై హత్యాయత్నం,
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు
ముగ్గురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీఎస్సీ ప్రసాద్