
ఆడబిడ్డకు అన్యాయం చేస్తావా?
హామీ అటకెక్కించేందుకు చంద్రబాబు మరో ఎత్తుగడా?
మండిపడుతున్న మహిళా లోకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెత తెలుగుదశంపార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. టీడీపీలో చంద్రబాబు దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో ద్వితీయ శ్రేణి నేత వరకు అందరూ ఒకే తీరున ఉన్నారనిపిస్తోంది. గద్దెనెక్కేందుకు సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు వాటిని ఎగ్గొట్టేందుకు దారులు వెతుకుతున్నారు. మాట ఇవ్వడం.. మాట తప్పడంలో.. పేటెంట్ అంటూ ఉందంటే అది చంద్రబాబుకే సొంతమంటుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలను గాలికి వదిలేసి చేష్టలుడిగి చూస్తున్న చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ తాజాగా తల్లికి వందనం అమలుచేసింది. ఈ పథకం అమలులో కూటమి ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెట్టింది. విద్యుత్ కనెక్షన్‌లు, ఆధార్ లింక్ మారిపోవడం, ఒక వినియోగదారుని విద్యుత్ సరీ్వసు మరొకరికి మార్చేసిన నేపథ్యంలో వాటిని చక్కదిద్దుకోవడంలో అష్టకష్టాలు పడ్డారు. కొందరైతే ఈ బాధలు పడలేక మొత్తానికి ఆ పథకమే వద్దనుకున్నారు. ప్రస్తుతం ఏపీ ఈపీడీసీఎల్ నిర్వాకంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తక్కువలో తక్కువ లెక్కలేస్తే లక్షన్నర మంది విద్యార్థులకు తల్లికి వందనం జమ కాలేదని చెబుతున్నారు.
ఈ పథకానికి ఉన్న ప్రతిబంధకాలతో తల్లులు రోడ్డునపడి సతమతమవుతుంటే తాజాగా మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలతో ఆడబిడ్డ నిధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ ‘ఆడబిడ్డ నిధి’ కోసం నిరీక్షిస్తున్న పేద మహిళల ఆశలపై టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేత, కీలక మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రెండు రోజుల తరువాత ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆంధ్రాను అమ్మాలన్న సంచలన వ్యాఖ్యలతో ఆడబిడ్డ నిధి అమలు చేయలేమని పరోక్షంగా తేల్చి చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అచ్చెన్న అలా అని ఉంటారని ఆ పార్టీ నేతల మధ్యనే చర్చ జరుగుతోంది. ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించినప్పుడు ఆడబిడ్డ నిధికి ఎంత వెచ్చించాలో నాడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు తెలియదా అని మహిళలు నిలదీస్తున్నారు.
సూపర్ సిక్స్‌లోని హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా ఆడబిడ్డలకు చంద్రబాబు సర్కారు అన్యాయం చేసింది. తాజాగా ఈ హామీని అటకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ పథకం అమలుచేయాలంటే ఆంధ్రాను అమ్మాలంటూ.. మంగళవారం విజయనగరంలో జరిగిన సభలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే తల్లికి వందనం అమలులోను కూటమి అర్హులకు ఎగనామం పెట్టింది. జిల్లాలో అర్హులైన విద్యార్థులు 3 లక్షల మంది ఉండగా 2 లక్షలు మందికి మాత్రమే సాయం జమ అయ్యింది. ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు అందజేయాల్సి ఉండగా కొందరికి రాష్ట్ర వాటాగా రూ.8500 నుంచి రూ. 9000 మాత్రమే తల్లుల అకౌంట్లకు జమ చేసింది. కేంద్రం వాటా త్వరలో జమవుతుందని మెసేజ్‌లు పంపి చేతులు దులుపుకొన్నారు. కాగా ఆడబిడ్డ నిధి కి మంగళం పాడేలా మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై మహిళలు భగ్గుమంటున్నారు. ఎంత ఖర్చవుతుంది? పథకం అమలుకు ఆదాయ వనరులు ఏమిటి? అనే విషయం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే ముందు తెలియదా అని మహిళా సంఘాల ప్రతినిధులు ప్రశ్నస్తున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్ నుంచే 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని బాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వారిద్దరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించిన సందర్భంలో ఊరూవాడ ఇదే విషయాన్ని ఊదరగొట్టారు. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తు గ్యారంటీ’ పేరిట ప్రజలకు అందించిన బాండ్లలో సైతం ఈ పథకం కింద ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరించారు. ఈ పథకం అమలుపై ఇంతవరకు అటు బాబు, ఇటు పవన్ ఇద్దరిలో ఏ ఒక్కరు పెదవి విప్పడం లేదు. ఈ ఏడాది అమలు చేస్తారనుకుంటుంటే మంత్రి అచ్చెన్నాయుడు ఇలా బాంబు పేల్చారని మహిళలు మండిపడుతున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..
19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని కూటమి ఇచ్చిన హామీని అటకెక్కిస్తారా అని మహిళలు ప్రశి్నస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆడబిడ్డ నిధి కోసం అర్హులుగా 18 లక్షల పైచిలుకు మహిళలు ఎదురుచూస్తున్నారు. ఇంత మందిని నిలువునా మోసం చేస్తారా అని విజ్ఞులు ప్రశ్నస్తున్నారు. 2014లో మాదిరిగానే డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని నమ్మించి గద్దెనెక్కాక గాలికి వదిలేసినట్టే ఈ హామీని కూడా అటకెక్కించేస్తారని మహిళలు ప్రశ్నస్తున్నారు.
కూటమి ప్రభుత్వ రెండు నాల్కల ధోరణి దుర్మార్గం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా రెండు నాల్కలతో మాట్లాడుతున్న కూటమి నాయకుల ధోరణి దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడం దారుణమైన విషయం. గత ప్రభుత్వ అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనంగా మార్చి.. రూ.15 వేలకు రూ.11 వేలు మహిళల ఖాతాల్లో వేసి మోసం చేయడం సరైన విధానం కాదు. కూటమి పాలనలో మహిళలకు ఇస్తానన్న ఏ హామీ అమలు కాలేదు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వడంపై మాట్లాడుతూ రాష్ట్రాన్ని అమ్మేయాల్సి ఉంటుందనడం అత్యంత హేయమైన చర్య. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఏడాది దాటినా ఇది అమలు కాలేదు. ఇలా మహిళలను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది.
– జరీనా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..
19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని కూటమి ఇచ్చిన హామీని అటకెక్కిస్తారా అని మహిళలు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆడబిడ్డ నిధి కోసం అర్హులుగా 18 లక్షల పైచిలుకు మహిళలు ఎదురుచూస్తున్నారు. ఇంత మందిని నిలువునా మోసం చేస్తారా అని విజ్ఞులు ప్రశ్నస్తున్నారు. 2014లో మాదిరిగానే డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని నమ్మించి గద్దెనెక్కాక గాలికి వదిలేసినట్టే ఈ హామీని కూడా అటకెక్కించేస్తారా అని మహిళలు ప్రశి్నస్తున్నారు.