
అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?
● పార్లమెంట్ సమావేశాలకు ముందు
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం
● వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర
అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీ మిథున్‌రెడ్డిని మద్యం కేసులో ఇరికించి జైలుకు పంపడం దారుణమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పార్లమెంటులో ప్రశ్నించకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాటి బ్రిటిష్ పాలనను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తలపిస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగం స్థానంలో బ్రిటిష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎన్నో కీలకమైన బిల్లులు చర్చకు రానున్నాయని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలన్న సంకల్పంతో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఉన్నారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెచ్చే ధైర్యం లేని కూటమి ఎంపీలు తమ చేతకాని తనాన్ని పార్లమెంటులో ఎవరూ ప్రశ్నించకుండా వ్యూహాత్మకంగా మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని మిథున్‌రెడ్డి లోక్‌సభలో బలంగా వినిపించారని, ఆయనకు ముస్లిం సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల తిరుగుబాటుతో కూటమి సర్కారు కూలిపోవడం ఖాయమని అన్నారు.