
15 మంది ప్రొబేషనరీ ఎస్సైల నియామకం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నూతనంగా జిల్లాలో నియమించిన 15 మంది ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్లకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో దిశానిర్దేశం జరిగింది. ఈ సందర్భంగా వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీలు ఎంబీఎన్.మురళీకృష్ణ, ఏవీ.సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎల్.చెంచిరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. వీరిలో అయిదుగురు మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. వీరు ఐదు నెలలు పాటు వివిధ విభాగాలలో శిక్షణ తీసుకోనున్నారు. పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏఎస్పీలు వారికి సూచించారు. క్షేత్ర స్తాయిలో ప్రజలతో ఎలా మెలగాలి, పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితుల సమస్యల పరిష్కారంలో శాస్త్ర, సాంకేతిక పద్దతులను ఎలా ఉపయోగించాలో వివరించారు. ప్రజలలో పోలీసు శాఖపై నమ్మకాన్ని పెంపొందించే విధంగా భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకనుగుణంగా నేర నియంత్రణ, పరిశోధన ఉండాలని, చార్జీషీట్లో సాంకేతికమైన ఆధారాలను జోడించి ఎక్కువ శాతం శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. మహిళలు, చిన్నారులకు చెందిన కేసుల విషయంలో ఎటువంటి అలసత్వం చూపించవద్దన్నారు. డీఎస్పీలు బి.రామకృష్ణ, టీవీఆర్‌కే.కుమార్, కృష్ణంరాజు, పవన్‌కుమార్‌రెడ్డి, ఆలీఖాన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.