
ఆ కాంట్రాక్టర్‌పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాలి
● తక్షణం కొత్త కాంట్రాక్టర్‌ను తీసుకోవాలి
● అన్నవరం దేవస్థానానికి
న్యాయవాది సలహా!
అన్నవరం: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించినట్లు నకిలీ చలానాలు ఇచ్చిన విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్‌పవర్ సర్వీసెస్ శానిటేషన్ కాంట్రాక్టర్‌పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాల్సి ఉంటుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. నకిలీ పీఎఫ్ చలానాల బాగో తంపై తీసుకోవాల్సిన చర్యలపై దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, శానిటేషన్ విభాగం అధికారులు న్యాయవాదిని సలహా అడిగారు. మార్చిలోనే సిబ్బంది ఖాతాలో పీఎఫ్ జమ చేయకపోతే అప్పట్లోనే సిబ్బంది కాంట్రాక్టర్‌కు ఆ విషయం తెలియజేయాలి. అతడి నుంచి ఎటువంటి సమాధానమూ రాకపోతే దేవస్థానానికి ఆ విషయం లిఖితపూర్వకంగా తెలపాలి. అప్పుడు దేవస్థానం ఆధికారులకు చర్య తీసుకునే అధికారం ఉండేది. అలా జరగలేదు కాబట్టి ఆ కాంట్రాక్టర్‌పై దేవస్థానం క్రిమినల్ చర్య తీసుకోవడం అంత సులువు కాదని న్యాయవాది చెప్పినట్లు సమాచారం. కాకపోతే నకిలీ పీఎఫ్ చలానాలు సృష్టించి, మోసం చేశారంటూ పీఎఫ్ అధికారులకు దేవస్థానం ఫిర్యాదు చేసి వారితో ఆ కాంట్రాక్టర్‌పై కేసు పెట్టవచ్చని సమాచారం. అదే సమయంలో ఆ కాంట్రాక్టర్‌ను తొలగించాలని న్యాయవాది సూచించినట్లు తెలుస్తోంది. షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాలని చెప్పినట్టు చెబుతున్నారు.
టెండర్ పిలవకుండానా?
దేవస్థానంలో చెత్త ట్రాక్టర్ నిర్వహణకు టెండర్ పిలిచారు. అదే విధంగా సత్రాల్లో దుప్పట్లు, కర్టెన్ల వంటివి ఉతికి, ఇసీ్త్ర చేయడానికి కూడా టెండర్ పిలిచారు. చిన్నచిన్న వాటికే టెండర్లు పిలుస్తున్నప్పుడు ప్రతి నెలా 350 మంది సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్ట్‌కు టెండర్ పిలవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో ఎటువంటి డిపాజిట్ లేకుండా, టెండర్ పిలవకుండా నామినేషన్ పద్ధతిలో కనకదుర్గా మ్యాన్‌పవర్ సర్వీసెస్‌కు శానిటేషన్ కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ఈ నకిలీ వ్యవహారానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 350 మంది పారిశుధ్య సిబ్బందికి కార్మిక చట్టాల ప్రకారం జీతాలిచ్చేందుకు దేవస్థానం నెలకు రూ.59 లక్షలు చెల్లించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. ప్రతి నెలా దేవస్థానం 13 శాతం, సిబ్బంది వాటా 12 శాతం వసూలు చేసి పీఎఫ్ చెల్లించి, ఆ రసీదులు జమ చేస్తే దేవస్థానం బిల్లు ఇవ్వాలి. కానీ మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆ సంస్థ ఫేక్ రసీదులు ఇచ్చి, సుమారు రూ.1.77 కోట్ల మేర బిల్లులు పొందింది. సిబ్బంది ఖాతాల్లో పీఎఫ్ జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు నిలదీయడంతో మూడు నెలలకు కలిపి పీఎఫ్‌కు సుమారు రూ.30 లక్షలు జమ చేసి కొత్త రశీదులు అందజేశారు.
కొత్త కాంట్రాక్ట్‌కు మరింత సమయం!
మరోవైపు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలన్నింటికీ కలిపి ఒకే శానిటేషన్ కాంట్రాక్ట్‌కు పిలిచిన టెండర్ ఖరారుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణను షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రసీదుల తనిఖీపై సూచనలు
పీఎఫ్ రసీదులు ఒరిజనల్ లేక ఫేక్ అనే విషయం తెలుసుకోవాలనే అంశంపై దేవస్థానం సిబ్బందికి పీఎఫ్ అధికారులు శనివారం అవగాహన కల్పించా రు. ఈఓ సుబ్బారావు కోరిక మేరకు కాకినాడ పీఎఫ్ ఆఫీసుకు చెందిన ఇద్దరు అధికారులు రసీదుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, గూగుల్‌లో పీఎఫ్ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయడం వంటివి వివరించారు.