
పొగాకు నారుమడులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
దేవరపల్లి: పొగాకు నారుమడులు వేయడానికి సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా టుబాకో బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని రసీదు పొందాలని రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ సూచించారు. వారికి మాత్రమే సీటీఆర్‌ఐ, ఐటీసీ సంస్థలు విత్తనాలు సరఫరా చేస్తాయని తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పంట నియంత్రణలో భాగంగా నర్సరీ దశ నుంచే నిబంధనలు కఠినతరం చేస్తున్నామని తెలిపారు. వాణిజ్య రైతులు రెండు హెక్టార్ల వరకూ విస్తీర్ణంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. నర్సరీలను ప్రత్యేక అధికారుల బృందం తనిఖీ చేస్తుందని, ఆ సమయంలో రైతులు రసీదు చూపించాలని చెప్పారు. పొగాకు సాగు చేసే రైతులు విధిగా రిజిస్ట్రేషన్ ఉన్న నర్సరీల నుంచి నారు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. పొగాకు నాట్ల సమయంలో బోర్డు అందిస్తున్న ఫారం–2తో పాటు నారు అమ్మిన నర్సరీ యజమాని ఇచ్చిన రసీదును జత చేసి, అధికారులకు అందజేయాలన్నారు. బోర్డు రిజిస్ట్రేషన్ లేకుండా నర్సరీలు వేసే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రసాద్ చెప్పారు. నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల జాబితాను బోర్డు వద్ద ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయంగా వర్జీని యా పొగాకు విలువ పెరగాలంటే ఉత్పత్తి తక్కువగా ఉండాలన్నారు. రైతులు ఎక్కువగా ఎల్‌వీ–7, ఎ–3 వంగడాలు సాగు చేస్తున్నారని, కొత్తగా సీటీఆర్‌ఐ ఎఫ్‌సీజే–11 వంగడం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని నర్సరీల నుంచి నారు కొనుగోలు చేసి, పొగాకు సాగు చేస్తే బ్యారన్ రిజిస్ట్రేషన్ నిలుపు చేస్తామని ప్రసాద్ చెప్పారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి శనివారం భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సుమారు 20 వేల మంది దర్శించుకున్నారు. ఉదయం నుంచీ భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంత మండపాలు రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు.